జానపద గాయకుడిపై కనక వర్షం!
ABN , Publish Date - May 16 , 2026 | 03:57 AM
భజన కార్యక్రమంలో జానపద గాయకుడు పాటలు పాడుతుండగా.. ఆయనపై నోట్ల వర్షం కురిపించారు. ఎంతలా అంటే ఆ గాయకుడు దాదాపు కనిపించనంతగా నోట్లు కుమ్మరించేశారు.
గోపాల్ సంధును నోట్లతో ముంచేసిన భక్తులు
గాంధీనగర్, మే 15: భజన కార్యక్రమంలో జానపద గాయకుడు పాటలు పాడుతుండగా.. ఆయనపై నోట్ల వర్షం కురిపించారు. ఎంతలా అంటే ఆ గాయకుడు దాదాపు కనిపించనంతగా నోట్లు కుమ్మరించేశారు. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా ఖంభాలియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో జరిగిన భజన కార్యక్రమంలో గుజరాతీ జానపద గాయకుడు గోపాల్ సంధు పాటలు పాడారు. ఆ సమయంలో కొందరు భక్తులు ఆయనపై కనక వర్షం కురిపించారు. ఓ దశలో సంధు కనిపించనంతగా నోట్లు కుమ్మరించారు. అయినా, ఆయన పాటలు పాడుతూనే ఉన్నారు. ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. వాటిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘‘అసలైన వర్క్ ఫ్రం హోం అంటే ఇదే. కూర్చుని నోట్ల వర్షం కురిపించుకుంటున్నాడు’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా.. ‘‘ఆయన శ్వాస సరిగా తీసుకోగలుగుతున్నారనే అనుకుంటున్నా. భక్తులు నోట్లు కుమ్మరిస్తూనే ఉన్నారు. ఆయన పాడుతూనే ఉన్నారు’’ అని మరొకరు కామెంట్ చేశారు. గుజరాత్‌లో భజనల్లో కళాకారులపై లక్షల రూపాయల నోట్లు వెదజల్లడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇ లాంటి ఘటనలు జరిగాయి. భజనలు, సంగీత విభావరు ల్లో గాయకులపై కనక వర్షం కురిపించి.. అలా జమైన సొ మ్మును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు.