దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలను ఎస్సీలుగానే గుర్తించాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:21 AM
దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలను ఎస్సీలుగానే గుర్తించాలని జాతీయ దళిత జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. దళితులు...
దళిత జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
న్యూఢిల్లీ, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలను ఎస్సీలుగానే గుర్తించాలని జాతీయ దళిత జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. దళితులు మతం మారినంత మాత్రాన వారి కులం మారినట్లు కాదన్నారు. క్రైస్తవం, ఇస్లాంలోకి వెళ్లిన దళితులను, ముస్లింలోని దూదేకుల, నూర్‌భాషా వర్గాలను ఎస్సీలుగా గుర్తించకపోతే భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో జాతీయ దళిత జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. మతం మారిన దళితులను టార్గెట్ చేస్తూ వారిపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్షను చూపుతోందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్ ఆరోపించారు. ఎస్సీలపై దేశవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయని, దీన్ని అరికట్టేందుకు అందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరముందని మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునిచ్చారు. జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ దళిత క్రైస్తవులకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని గాలి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.