Share News

దక్షిణాదికి దిగులొద్దు!

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:20 AM

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. పునర్విభజనతో లోక్‌సభ స్థానాలు అన్ని రాష్ట్రాలకు 50 శాతం చొప్పున పెరగనున్నాయని పేర్కొంది.

దక్షిణాదికి దిగులొద్దు!

  • డీలిమిటేషన్‌తో అన్ని రాష్ట్రాలకూ 50 శాతం సీట్లు

  • 2011 నాటి జనాభా లెక్కలు నిర్ణయాత్మకం కావు: కేంద్ర వర్గాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. పునర్విభజనతో లోక్‌సభ స్థానాలు అన్ని రాష్ట్రాలకు 50 శాతం చొప్పున పెరగనున్నాయని పేర్కొంది. ‘‘ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదు. 2011 జనాభా లెక్కలు నిర్ణయాత్మక అంశం కాదు. కాబట్టి నిష్పత్తిలో మార్పు ఉండదు.’’ అని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. నారీశక్తి వందన పేరుతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో పార్లమెంటు సీట్లను 850 వరకు పెంచాలని నిర్ణయించింది. వీటిలో 815 రాష్ట్రాలకు చెందినవి కాగా, 35 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీట్లు. కాగా, ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు స్పందిస్తూ.. దక్షిణాది రాష్ట్రాలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌,డీలిమిటేషన్‌పై తప్పుడు లెక్కలు వేస్తున్నారని పేర్కొన్నారు.

తమిళనాడు: ప్రస్తుతం 39 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం.. పునర్విభజన జరిగితే.. 49 స్థానాలకు పెరుగుతాయి. కానీ, ప్రస్తుతం 50 శాతం పెంచాలన్న కేంద్రం నిర్ణయంతో ఈ రాష్ట్రంలో సీట్లు 59 కానున్నాయి.

కేరళ: ప్రస్తుతం 20 సీట్లు ఉండగా, 2011 జనాభాలెక్కల ప్రకారం 23కు చేరతాయి. కానీ.. ప్రస్తుత ఫార్ములా ప్రకారం.. 30కి పెరగనున్నాయి.

ఏపీ: ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే 33 సీట్లకు పెరుగుతాయి. కానీ, తాజాగా ఫార్ములా ప్రకారం.. మొత్తం 37 సీట్లు అందివస్తాయి.

ఒడిశా: ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 21 సీట్లు ఉండగా.. 2011 లెక్కల ప్రకారం.. 28 సీట్లకు చేరుతాయి. కానీ, 50 శాతం పెంపు ప్రకారం.. ఈ సీట్లు 31కి చేరనున్నాయి.

తెలంగాణ: ప్రస్తుతం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2011 జనాభా ప్రకారం పునర్విభజన చేస్తే ఇవి 24కు చేరతాయి. కానీ, 50 శాతంచొప్పున సీట్లు పెంచితే.. ఈ సంఖ్య 25కు చేరనుంది.

కర్ణాటక: ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 28 సీట్లు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన 41 సీట్లకు పెరుగుతాయి. కానీ.. కేంద్రం ప్రతిపాదిస్తున్న లెక్క ప్రకారం 42 సీట్లకు చేరుకుంటాయి.

Updated Date - Apr 16 , 2026 | 03:20 AM