‘ఎలక్టోరల్’ ఓటు విలువలో భారీ మార్పు!
ABN , Publish Date - Nov 30 , 2026 | 03:35 AM
డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యుల ఓటు విలువ భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ బిల్లులో తాజా జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోలేదు.
డీలిమిటేషన్‌తో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యుల
వ్యక్తిగత ఓటు విలువలో తగ్గుదల
న్యూఢిల్లీ, నవంబరు 29: డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యుల ఓటు విలువ భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ బిల్లులో తాజా జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోలేదు. అందువల్ల డీలిమిటేషన్ తర్వాత ఎలక్టోరల్ కాలేజీ ఓటు విలువ లెక్కింపులో రాష్ట్రాల జనాభా పాతదే ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య మాత్రం పెరుగుతుంది. దీంతో ఇప్పుడున్న ఓటు విలువను కొత్తగా పెరిగే సభ్యులకు కూడా పంచాల్సి ఉంటుంది. అప్పుడు వారందరి ఓటు విలువ తగ్గుతుంది. అయితే, రాష్ట్రాల మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓటు విలువలో మాత్రం ఏమార్పూ ఉండదు.
రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎన్నికైన మొత్తం సభ్యులు ఉంటారు. 2022 రాష్ట్రపతి ఎన్నికల గణాంకాల ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో 543 మంది లోక్‌సభ సభ్యులు, 233 మంది రాజ్యసభ సభ్యులు, 4,033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో జమ్మూకశ్మీర్ ఎమ్మెల్యేలను కలపలేదు.
2022లో 4,033 మంది ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 5,43,231గా ఉంది. లోక్‌సభ, రాజ్యసభలోని మొత్తం ఎన్నికైన సభ్యుల(776)తో దీనిని భాగిస్తే ఒక్కో ఎంపీ ఓటు విలువ 700 అయ్యింది.
ఎమ్మెల్యేల ఓటు విలువను సంబంధిత రాష్ట్ర మొత్తం జనాభా ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు తెలంగాణలో మొత్తం ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు 119 మంది. 1971 జనాభా లెక్కల ప్రకారం ఈ మొత్తం ఎమ్మెల్యేల ఎలక్టోరల్ ఓట్ల విలువ 15,708. దీనిని 119 మందికి పంచితే ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో 132 వచ్చింది. డీలిమిటేషన్ ద్వారా 50 శాతం సీట్లను పెంచితే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 179కి చేరుతుంది. అప్పుడు ఒక్కో ఎమ్మెల్యే ఎలక్టోరల్ ఓటు విలువ 88కి తగ్గుతుంది.
డీలిమిటేషన్ తర్వాత లోక్‌సభలో ఎన్నికయ్యే ఎంపీల సంఖ్య 824కు పెరుగుతుందని భావిస్తున్నారు. రాజ్యసభ సీట్ల పెంపు గురించి బిల్లులో ప్రస్తావించలేదు. అందువల్ల పెద్దల సభలో ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 233గానే ఉంటుంది. ఈ మొత్తం కలిపి 1,057 అవుతుంది.
మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 4,033 నుంచి 6.050కి పెరిగే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రాల మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ మాత్రం 5,43,231గానే ఉంటుంది. జనాభాలో మార్పు లేదు కాబట్టి ఇందులో మార్పు ఉండదు.
అప్పుడు ఈ 5,43,231 ఓట్ల విలువనే 1,057 మంది ఎంపీల మధ్య విభజిస్తారు. దీంతో ఒక్కో ఎంపీ ఎలక్టోరల్ ఓటు విలువ 513.94 అవుతుంది. దీనిని సమీప పూర్ణాంకానికి సవరిస్తే 514 అవుతుంది. అంటే ఒక్కో ఎంపీ ఓటు విలువ 700 నుంచి 514కు తగ్గుతుంది. ఒకవేళ జమ్మూకశ్మీర్ ఎమ్మెల్యేల ఎలక్టోరల్ ఓటు విలువ (4,500)ను కూడా కలిపితే మొత్తం ఒక్కో ఎంపీ ఓటు విలువ 518 అవుతుంది. ఒకవేళ డీలిమిటేషన్‌లో 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని ఉంటే ఉత్తరాది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ భారీగా పెరిగి.. దక్షిణాది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ తగ్గిపోయేది.