Share News

ఆందోళనంతా.. కమిషన్‌పైనే!

ABN , Publish Date - Nov 30 , 2026 | 02:44 AM

డీలిమిటేషన్‌ ప్రక్రియలో ప్రతిపక్షాల ఆందోళన లోక్‌సభ స్థానాల పెంపుపైనా? లేక వాటి సరిహద్దులను నిర్ణయించే కమిషన్‌ కూర్పుపైనా? ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే ప్రధాన చర్చగా మారింది.

ఆందోళనంతా.. కమిషన్‌పైనే!

  • బీజేపీకి రాజకీయ లబ్ధి కలిగేలా నియోజకవర్గాల సరిహద్దుల మార్పు జరగొచ్చంటున్న ప్రతిపక్షాలు

  • జెర్రీమాండరింగ్‌ ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపణలు

  • అస్సాం పునర్విభజనే ఉదాహరణంటున్న కాంగ్రెస్‌

  • సీఈసీ జ్ఞానేశ్‌ నేతృత్వంలో కమిషన్‌: రాహుల్‌

  • ఈ ఆరోపణలను తోసిపుచ్చిన బీజేపీ నేతలు

  • సుప్రీం మాజీ జడ్జి నేతృత్వంలో డీలిమిటేషన్‌ కమిషన్‌.. సభ్యులుగా సీఈసీ, రాష్ట్రాల సీఈవోలు

న్యూఢిల్లీ, నవంబరు 29: డీలిమిటేషన్‌ ప్రక్రియలో ప్రతిపక్షాల ఆందోళన లోక్‌సభ స్థానాల పెంపుపైనా? లేక వాటి సరిహద్దులను నిర్ణయించే కమిషన్‌ కూర్పుపైనా? ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే ప్రధాన చర్చగా మారింది. లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచుతూ, రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించే తాజా బిల్లు.. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను కొంతమేర తగ్గించినా నియోజకవర్గాల సరిహద్దుల అంశం కొత్త వివాదానికి తెరతీసింది. అధికారంలో ఉన్న బీజేపీకి ఎన్నికల్లో ప్రయోజనం కలిగేలా నియోజకవర్గాల సరిహద్దులను మార్చేందుకు (గెర్రీమాండరింగ్‌కు) కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌, ఆర్జేడీ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. డీలిమిటేషన్‌ కంటే సంబంధిత కమిషన్‌ కూర్పు, దాని నిర్ణయాలపై పర్యవేక్షణే అసలు సమస్యగా పేర్కొంటున్నాయి. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ డీలిమిటేషన్‌ కమిషన్‌కు అధ్యక్షత వహిస్తారని, మూడో సభ్యుడిని కూడా ఆయనే ఎంపిక చేస్తారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దీనివల్ల అధికారపక్షానికి అనుకూలంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చుకునే అవకాశం ఉంటుందని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సైతం సీట్ల పెంపు కంటే జెర్రీమాండరింగ్‌ ప్రమాదమే తీవ్రమైనదని వ్యాఖ్యానించారు. 2023లో అస్సాంలో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనను కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, గౌరవ్‌ గొగోయ్‌ జెర్రీమాండరింగ్‌కు ఉదాహరణ అని చెబుతున్నారు. అస్సాంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య గతంలో సుమారు 35ఉండగా పునర్విభజన తర్వాత 24కు తగ్గాయని పేర్కొంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తోసిపుచ్చారు. నియోజకవర్గాల సరిహద్దులను కేంద్ర ప్రభుత్వం నేరుగా నిర్ణయించదని.. సుప్రీం మాజీ జడ్జి నేతృత్వంలోని స్వతంత్ర కమిషన్‌ ఈ బాధ్యతను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి కమిషన్‌ ఏర్పాటు చేసినప్పుడు ‘జెర్రీమాండరింగ్‌’ జరిగిందని కాంగ్రెస్‌ అంగీకరిస్తుందా? అని నిలదీశారు.


‘డీలిమిటేషన్‌ కమిషన్‌’ ఇదీ

సాధారణంగా డీలిమిటేషన్‌ కమిషన్‌కు సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. వారిని కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఇక సీఈసీ స్వయంగా లేదా ఆయన నామినేట్‌ చేసే మరో ఎన్నికల కమిషనర్‌ రెండో సభ్యుడిగా ఉంటారు. సంబంధిత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మూడో సభ్యుడిగా వ్యవహరిస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు, గరిష్ఠంగా ఐదుగురు లోక్‌సభ సభ్యులను అసోసియేట్‌ సభ్యులుగా నియమిస్తారు. సంబంధిత సభల స్పీకర్లు వారిని నామినేట్‌ చేస్తారు. వీరికి కమిషన్‌లో ఓటు హక్కు ఉండదు. కమిషన్‌ కార్యకలాపాలకు సహకరించడం, స్థానిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను తెలియజేయడం వరకే ఎమ్మెల్యేలు, ఎంపీల పాత్ర పరిమితం. అయితే, తమకు కూడా కమిషన్‌లో ప్రాతినిధ్యం ఉండాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, రాజ్యాంగంలోని 329(ఎ) అధికరణం ప్రకారం డీలిమిటేషన్‌ చట్టాలు, ఆదేశాలపై న్యాయస్థానాల జోక్యానికి సాధారణంగా పరిమితులు ఉన్నాయి. అయితే రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినప్పుడు, కమిషన్‌ తన చట్టబద్ధ అధికారాలను దాటి వ్యవహరించినప్పుడు న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది.


డీలిమిటేషన్‌ ప్రక్రియకు రెండేళ్లకుపైనే..

లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను ఒకేసారి చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. డీలిమిటేషన్‌ కమిషన్‌ పరిశీలన జరిపి.. జనాభాతోపాటు వివిధ ఆంశాల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయిస్తుంది. ప్రతిపాదిత నియోజకవర్గాల సరిహద్దులతో ముసాయిదాను విడుదల చేయడం, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడం, బహిరంగ విచారణలు నిర్వహించడం వంటి ప్రక్రియలు ఉంటాయి. కమిషన్‌ తుది నివేదిక, ఆదేశాలు గెజిట్‌లో ప్రచురించిన తర్వాత చట్టబద్ధత పొందుతాయి. ఈ మొత్తం ప్రక్రియకు రెండేళ్ల నుంచి రెండున్నరేళ్ల వరకు పట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2002-08 మధ్య జరిగిన డీలిమిటేషన్‌ ప్రక్రియకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ కుల్దీప్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు.


జెర్రీమాండరింగ్‌ అంటే?

రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులను ఉద్దేశపూర్వకంగా మార్చడాన్ని జెర్రీమాండరింగ్‌ అంటారు. ఒక పార్టీకి ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం కల్పించడం లేదా ప్రత్యర్థి పార్టీ బలాన్ని తగ్గించడం దీని ఉద్దేశం. అమెరికాలో 1812లో ఈ పదం పుట్టింది. అప్పటి మసాచుసెట్స్‌ గవర్నర్‌ ఎల్బిడ్ర్జ్‌ జెర్రీ రూపొందించిన నియోజకవర్గం ఆకారం సాలమాండర్‌ (బల్లిలాంటి జీవి)ని పోలి ఉందంటూ ఓ కార్టూన్‌ ప్రచురితమైంది. జెర్రీ, సాలమాండర్‌ పదాలను కలిపి ‘జెర్రీమాండరింగ్‌’గా వ్యవహరిస్తున్నారు. అంటే అంటే ఒక పార్టీకి అనుకూలమైన ప్రాంతాలను ఒకే నియోజకవర్గంలో చేర్చడం, ప్రత్యర్థి పార్టీకి బలమున్న ప్రాంతాలను వేర్వేరు నియోజకవర్గాల్లోకి విభజించడం ద్వారా ఫలితాలను మార్చే అవకాశం ఉంటుంది.

Updated Date - Nov 30 , 2026 | 02:47 AM