Share News

పునర్విభజన బిల్లుతో తీవ్ర ప్రమాదం

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:12 AM

మహిళా బిల్లుతో కలిపి కేంద్రం తెస్తున్న పునర్విభజన బిల్లు రాజకీయ ప్రాతినిధ్యంలో తీవ్రమైన అసమానతలను తీసుకొచ్చే ప్రమాదం ఉందని..

పునర్విభజన బిల్లుతో తీవ్ర ప్రమాదం

  • అసమానతలు తలెత్తుతాయి: సీపీఎం ప్రధాన కార్యదర్శి

  • కేంద్రీకృత అధికారం కోసమే: సీపీఐ ప్రధాన కార్యదర్శి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: మహిళా బిల్లుతో కలిపి కేంద్రం తెస్తున్న పునర్విభజన బిల్లు రాజకీయ ప్రాతినిధ్యంలో తీవ్రమైన అసమానతలను తీసుకొచ్చే ప్రమాదం ఉందని.. ఉత్తరాది రాష్ట్రాలు గణనీయంగా ప్రయోజనం పొందుతాయని, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు నష్టపోతాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. ‘నిష్పక్షపాతంగా ఉండాల్సిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ బీజేపీలో చేరిపోయినట్లుగా.. త్వరలో ఏర్పాటయ్యే పునర్విభజన కమిషన్‌ కూడా పని చేస్తే బీజేపీకి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది’ అని విమర్శించారు. పునర్విభజనతోనో, జనగణనతోనో ముడిపెట్టకుండా మహిళా కోటాను తక్షణం అమలు చేయాలని బేబీ డిమాండ్‌ చేశారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పందిస్తూ.. దేశంలో కేంద్రీకృత అధికారాన్ని తీసుకొచ్చేలా నియోజకవర్గాలను మార్చటం కోసం మహిళా బిల్లును ఒక తెరలాగా బీజేపీ వాడుకుంటోందని విమర్శించారు. దశాబ్దాల కమ్యూనిస్టు ఉద్యమం ఫలితంగానే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ అన్న అంశం ముందుకొచ్చిందని, కానీ, అంత కీలకమైన అంశాన్ని పునర్విభజనతో, జనగణనతో ముడిపెట్టి కేంద్రప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందన్నారు. బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్లను మహిళా బిల్లు వ్యతిరేకులుగా చిత్రీకరించాలన్న దురుద్దేశంతోనే కేంద్రం ఈ కుట్రకు పాల్పడిందని విమర్శించారు.

Updated Date - Apr 17 , 2026 | 03:12 AM