Share News

కాంగ్రెస్‌ ఆశలు ఆవిరి

ABN , Publish Date - Nov 30 , 2026 | 03:11 AM

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని గణనీయంగా ప్రభావితం చేయనున్న నియోజకవర్గాల పునర్విభజనకు దాదాపు లైన్‌ క్లియర్‌ అయింది. పార్లమెంటు ఉభయ సభల్లో అవసరమైన..

కాంగ్రెస్‌ ఆశలు ఆవిరి

  • ఇండి కూటమిలో చీలిక

  • స్టాలిన్‌తో కాంగ్రెస్‌ అగ్రనేతల చర్చలు విఫలం

  • నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం!

  • టీవీకేకు మద్దతుపై స్టాలిన్‌కు సోనియా క్షమాపణ!

  • అయినా తగ్గని స్టాలిన్‌.. ఇండి కూటమిలో ఉన్నా డీలిమిటేషన్‌కు మద్దతు ఇచ్చేవాళ్లమని వ్యాఖ్య

  • రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ

  • తమిళనాడులో కాంగ్రెస్‌ తీరుపై నిలదీయాలని స్టాలిన్‌కు సూచించిన కూటమిలోని ఓ నేత

  • ముంబై వెళ్లి పవార్‌ను కలిసిన రాహుల్‌, ఖర్గే.. అయినా మద్దతుకే ఎన్సీపీ సై.. అదే బాటలో జేఎంఎం

  • అవసరమైతే క్రాస్‌ ఓటింగ్‌, విపక్ష ఎంపీల గైర్హాజరు

  • వంటి వ్యూహాలకూ పదును పెట్టిన మోదీ సర్కారు లోక్‌సభలో 371 మంది మద్దతు లభిస్తుందని ధీమా

  • నేటి నుంచే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

  • డీలిమిటేషన్‌-మహిళా రిజర్వేషన్లకు సంబంధించి మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

  • తప్పనిసరిగా హాజరుకావాలంటూ తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌, ఇతర పార్టీల విప్‌లు

  • పార్లమెంటు ప్రాంగణం, ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భారీగా భద్రత

‘సోదర’ పోస్టులు

పునర్విభజన బిల్లును ఆమోదిస్తే సీట్ల సంఖ్య 850కి పెరిగి.. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది. తమిళులను దుష్టశక్తుల బారి నుంచి కాపాడేందుకు నా ‘సోదరుడు’ స్టాలిన్‌ రక్షణగా నిలబడతారని ఆకాంక్షిస్తున్నా.

- ఎక్స్‌లో రాహుల్‌

రాజ్యాంగాన్ని, రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో డీఎంకే పోషించిన చారిత్రక పాత్రను గుర్తించినందుకు ‘సోదరుడు’ రాహుల్‌గాంధీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. తమిళుల ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి ప్రతి నిర్ణయమూ తీసుకున్నాం.

- ఎక్స్‌లో స్టాలిన్‌

న్యూఢిల్లీ/చెన్నై, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): దేశ రాజకీయ ముఖచిత్రాన్ని గణనీయంగా ప్రభావితం చేయనున్న నియోజకవర్గాల పునర్విభజనకు దాదాపు లైన్‌ క్లియర్‌ అయింది. పార్లమెంటు ఉభయ సభల్లో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీకి సరిపడా మద్దతు సాధించే దిశగా ఎన్‌డీఏ సర్కారు పూర్తిగా సఫలమైంది. డీలిమిటేషన్‌ బిల్లుపై ప్రతిపక్ష కూటమిలో చీలిక వచ్చింది. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా ఇండి కూటమి నేతలు చెన్నైకి వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశమైనా ఫలితం లేకపోయింది.


బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న తమ నిర్ణయంలో మార్పు లేదని స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఎన్సీపీ కూడా డీలిమిటేషన్‌కు మద్దతువైపే మొగ్గు చూపింది. జేఎంఎం కూడా సిద్ధమైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లుకు 371 మంది సభ్యుల మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా సోమవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదిక కానున్నాయి. డీఎంకేకు లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో ఎనిమిది మంది సభ్యులున్నారు. ఈ సంఖ్యలు రాజ్యాంగ సవరణ బిల్లుకు కీలకంగా మారాయి. ఈ క్రమంలో మద్దతివ్వాలన్న డీఎంకే నిర్ణయాన్ని మార్చుకునేలా ఒప్పించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు ఆదివారం చివరి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఇతర ఇండియా కూటమి నేతలు ఆదివారం చెన్నైకి వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ సీఎంలు రేవంత్‌ రెడ్డి, డీకే శివకుమార్‌, సీఎం వీడీ సతీశన్‌ సహా ఇతర నేతలూ ఈ భేటీలో పాల్గొన్నారు. డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకించాలని, ప్రతిపక్షాల ఉమ్మడి వైఖరికి కట్టుబడి ఉండాలని వారు స్టాలిన్‌ను కోరారు. నిజానికి ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. దీర్ఘకాలిక మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు చెప్పకుండా టీవీకే పార్టీకి కాంగ్రెస్‌ మద్దతివ్వడం, ప్రభుత్వంలో చేరడంపై స్టాలిన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇండి కూటమి నుంచి బయటికి వచ్చారు. ఆదివారం భేటీలో ఆయన ఈ అంశంపై గట్టిగా ప్రశ్నించినట్టు సమాచారం. అంతేకాదు ఈ భేటీకి హాజరైన ఇండి కూటమి నేత ఒకరు స్టాలిన్‌ను పక్కకు తీసుకెళ్లి.. ఎన్నికల నాటి పరిణామాలపై కాంగ్రెస్‌ పెద్దలను నిలదీయాలని సూచించినట్టు తెలిసింది.


ఈ క్రమంలో స్టాలిన్‌ ఆగ్రహాన్ని చల్లార్చడానికి కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ స్వయంగా క్షమాపణ (సారీ) చెప్పినట్టు సమాచారం. బిల్లులను వ్యతిరేకించే విషయంపై తమతో కలిసిరావాలని రాహుల్‌ గాంధీ కూడా అభ్యర్థించారు. కానీ.. తమ పార్టీ కోరుతున్న రక్షణలను కొత్త బిల్లులో పొందుపరిచినందున మద్దతు నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని స్టాలిన్‌ తేల్చిచెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఓటేస్తే ప్రస్తుతమున్న రక్షణ కూడా కోల్పోయే ప్రమాదముందని స్పష్టం చేశారు. బిల్లుకు కాంగ్రెస్‌ సారథ్యంలోని పార్టీలు ఎలాంటి ప్రత్యామ్నాయాన్నీ ప్రతిపాదించలేదని పేర్కొన్నారు. అయితే బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాక ఏర్పాటయ్యే పునర్విభజన కమిషన్‌ అంశంలో కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేయగా.. ఆ కమిషన్‌ న్యాయబద్ధంగా వ్యవహరించేలా చూస్తామని స్టాలిన్‌ తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం తాము ఇండి కూటమిలో లేమని, ఒకవేళ కూటమిలో ఉన్నా.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు ఇచ్చేవాళ్లమని కూడా పేర్కొన్నట్టు తెలిసింది.


రాహుల్‌, స్టాలిన్‌ ‘సోదర’ పోస్టులు

చర్చలకు ముందు.. ఆదివారం ఉదయం పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా రాహుల్‌ తన ఎక్స్‌పేజీలో ఓ పోస్టు చేశారు. పునర్విభజన బిల్లును ఆమోదిస్తే సీట్ల సంఖ్య 850కి పెరిగి.. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. తమిళులకు వ్యతిరేకంగా వ్యవహరించే దుష్టశక్తుల బారి నుంచి వారిని కాపాడేందుకు తన ‘సోదరుడు’ స్టాలిన్‌ రక్షణ కవచంలా నిలబడతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్‌ పోస్టుకు స్టాలిన్‌ అంతేవేగంగా స్పందించారు. రాజ్యాంగాన్ని, రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో డీఎంకే పోషించిన చారిత్రక పాత్రను గుర్తించినందుకు ‘సోదరుడు’ రాహుల్‌గాంధీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. తమిళనాడు, తమిళ ప్రజల ప్రయోజనాలకే తాము ప్రాధాన్యమిచ్చి ప్రతి నిర్ణయమూ తీసుకున్నామన్నారు.

వెనక్కి తగ్గని శరద్‌పవార్‌ ఎన్సీపీ..

శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బిల్లుకు మద్దతు తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను సమానంగా 50ు పెంచే ప్రతిపాదనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని పార్టీ నేత జితేంద్ర అవ్హాద్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖర్గే, రాహుల్‌ గాంధీ, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, పలువురు ఇండి కూటమి నేతలు ఆదివారం రాత్రి ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కలిశారు. డీలిమిటేషన్‌కు మద్దతు ఇవ్వవద్దని కోరారు. కానీ సానుకూల ఫలితం రాలేదని తెలిసింది. మరోవైపు జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.


శరద్‌పవార్‌ కాళ్లపై పడతా!

డీలిమిటేషన్‌కు మద్దతుపై ఎన్‌సీపీ వెనక్కి తగ్గితే ఆ పార్టీ చీఫ్‌ పవార్‌ పాదాల వద్ద తన తల పెట్టి క్షమాపణలు కోరుతానని మహారాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విజయ్‌ వడెట్టివార్‌ అన్నారు. తనను రాజకీయాల నుంచి వైదొలగాలని చెబితే వదిలేస్తానని చెప్పారు. నిజానికి డీలిమిటేషన్‌కు మద్దతు ఇచ్చేందుకు ఎన్‌సీపీ సిద్ధమైన నేపథ్యంలో.. విజయ్‌ శనివారం శరద్‌పవార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. శరద్‌పవార్‌ వెన్నుపోటుదారుడని ఆరోపించారు.

371 ఓట్లు సాధిస్తామన్న ధీమాలో మోదీ సర్కారు

డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన మూడు బిల్లులకు లోక్‌సభలో 371 మంది సభ్యుల మద్దతు లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కూటమి పార్టీలతో పాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తాయని అంటున్నాయి. లోక్‌సభలో 540 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడానికి కనీసం 360 ఓట్లు అవసరమవుతాయి. ఈ లెక్కన మోదీ ప్రభుత్వం అవసరమైనదానికన్నా ఎక్కువ మద్దతు వస్తుందని చెబుతోంది. ఇక రాజ్యాంగంలోని 368వ అధికరణం ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి రెండు షరతులు తప్పనిసరి. లోక్‌సభ, రాజ్యసభల్లోని మొత్తం సభ్యుల్లో సగానికిపైగా మద్దతు ఇవ్వడంతోపాటు, సభకు హాజరైన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది అనుకూలంగా ఓటేయాలి. ఇలా మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రతిపక్షాలను కూడగట్టిన మోదీ సర్కారు... అవసరమైతే క్రాస్‌ ఓటింగ్‌, ప్రతిపక్ష ఎంపీల గైర్హాజరు వంటి వ్యూహాలకూ పదును పెట్టినట్టు తెలిసింది.


అందరూ రావాల్సిందే.. కాంగ్రెస్‌, బీజేపీ విప్‌లు

డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదం, తిరస్కారానికి సంబంధించి ప్రతి ఎంపీ ఓటు కీలకం కావడంతో ప్రధాన పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌, ఎస్‌పీ, టీఎంసీ, జేడీయూ, ఎన్సీపీ తదితర పార్టీలు తమ లోక్‌సభ సభ్యులకు విప్‌లు జారీ చేశాయి. సభకు తప్పనిసరిగా హాజరుకావాలని, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశించాయి. సమావేశాలు జరిగే నాలుగు రోజులు సభలో ఉండాలని బీజేపీ తమ ఎంపీలకు స్పష్టం చేసింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గ కమిటీ సభ్యులతో ప్రధాని మోదీ ఆదివారం తన నివాసంలో భేటీ అయ్యారు.

నేటి నుంచే ప్రత్యేక సమావేశాలు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభం అవుతున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33ు రిజర్వేషన్ల తక్షణ అమలుతోపాటు, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల స్థానాలను 50శాతం మేర పెంచేందుకు ఉద్దేశించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లు--2026 సహా మొత్తం మూడు బిల్లులను మోదీ సర్కారు పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ కలిసి రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) రెండవ బిల్లు-2026, డీలిమిటేషన్‌ (రెండవ) బిల్లు-2026లను సభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ సోమవారం ఉదయం 11 గంటలకు, రాజ్యసభ డిసెంబరు 2వతేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 3వ తేదీతో ప్రత్యేక సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. ప్రత్యేక సమావేశాల తొలిరోజైన సోమవారం ఉదయం 11 గంటలకు ఇటీవల మరణించిన ఆరుగురు మాజీ ఎంపీలకు సభ సంతాపం ప్రకటించనుంది. డీలిమిటేషన్‌-మహిళా రిజర్వేషన్‌ బిల్లులపై చర్చ సమయంలో పార్లమెంటులో, బయటా భారీగా, ఎంపీల ఇళ్ల వద్ద భద్రత ఏర్పాటు చేశారు.

Updated Date - Nov 30 , 2026 | 03:15 AM