ఈ సమావేశాల్లోనే ‘పునర్విభజన’ బిల్లు
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:45 AM
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే..
న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి ): దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే.. లోక్‌సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా అమలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. మంగళవారం జరిగే సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏపీ) సమావేశంలో ఈ బిల్లుల గురించి ప్రభుత్వం ప్రస్తావించవచ్చునని సమాచారం. కాగా ఈ బిల్లుల ఆమోదం కోసం శని, ఆదివారాలు కూడా పార్లమెంట్ సమావేశాలు జరిపించాలని, అవసరమైతే సమావేశాలను ఏప్రిల్ 2 నుంచి మరో వారం వరకు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపును వ్యతిరేకించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడున్న నియోజకవర్గాల్లో 50 శాతం అదనంగా నియోజకవర్గాలు చేరే అవకాశాలున్నాయి. ఫలితంగా లోక్‌సభ సభ్యుల సంఖ్య 816కు చేరే అవకాశం ఉంది. 816 సీట్లయితే.. అందులో 273 సీట్లు మహిళలకు రిజర్వు అవుతాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో లోక్‌సభ సీట్లు 25 లేదా 26కు, అసెంబ్లీ సీట్లు 178 లేదా 179కి పెరిగే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం ఉన్న 25 నుంచి 37-38కి, అసెంబ్లీ సీట్లు 262-263కు పెరగొచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై తెలుగుదేశం, బిజూ జనతాదళ్, వైసీపీ, శివసేన (యూబీటీ), మజ్లిస్ తదితర పార్టీలతో చర్చలు జరిపారు.