Delhi Air Pollution: గ్యాస్‌చాంబర్‌లా ఢిల్లీ!
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:33 AM
రెండడుగుల దూరంలో ఏముందో కనిపించనంత దట్టంగా కమ్మేసిన పొగమంచు.. గాలిలో ప్రమాణాలకు మించి ప్రమాదకరమైన విషవాయువులు..
వాయుకాలుష్యంతో కునారిల్లుతున్న దేశ రాజధాని
ఆస్తమా, న్యూమోనియా రోగులకు నిత్యం నరకం
శ్వాస సమస్యలతో ఆస్పత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు
పొగమంచుతో విమానాల రాకపోకలు ఆలస్యం
వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ ధూళి, సమీప రాష్ట్రాల్లో పంటవ్యర్థాల దహనమే కారణాలు
బీజింగ్‌లో పాతికేళ్ల క్రితం ఇదే సమస్యతో ఇబ్బందులు
చైనా సర్కారు చర్యలతో పదేళ్లలో పరిస్థితి మెరుగు
అవే విధానాలను ఢిల్లీలోనూ పాటించాలి: నిపుణులు
రెండడుగుల దూరంలో ఏముందో కనిపించనంత దట్టంగా కమ్మేసిన పొగమంచు.. గాలిలో ప్రమాణాలకు మించి ప్రమాదకరమైన విషవాయువులు.. పులిమీద పుట్రలా, ఇంటా బయటా, అణువణువునా వ్యాపించి ఉన్న మొండి బ్యాక్టీరియా.. ఇదీ దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి! అప్పుడెప్పుడో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను చంపేందుకు నాజీ నియంత హిట్లర్ గ్యాస్ చాంబర్లను వాడేవాడని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఢిల్లీ నగరమే ఈ వాయుకాలుష్యంతో, యాంటీబయాటిక్ మందులకు లొంగని సూపర్‌బగ్స్‌తో.. ప్రమాదకరమైన గ్యాస్‌చాంబర్‌లా మారి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరీముఖ్యంగా.. ఆస్తమా, న్యూమోనియా వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ వాతావరణం అక్షరాలా నరకం చూపిస్తోంది. గొంతు మంట, ఊపిరి తీసుకోలేక పోవడం వంటి సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఏటా చలికాలం రాగానే ఢిల్లీని తీవ్రంగా ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఈ సీజన్‌లో సగటు ఢిల్లీవాసి పీల్చే ఊపిరిలో ఎంత కాలుష్యం ఉంటుందంటే.. రోజుకు 33-50సిగరెట్లు తాగినదాంతో సమానమని అంచనా. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ).. 0 నుంచి 50 మధ్య ఉంటే మంచిది. 51-100 వరకూ..పర్వాలేదు. 101-150 మధ్యలో ఉంటే..వృద్ధులు, పిల్లలకు ఇబ్బంది. 151-200 వరకూ ఉంటే ఆ గాలి అనారోగ్యకరమైనది. 201-300 వరకూ అత్యంత అనారోగ్యకరం. 301 దాటితే అత్యవసర పరిస్థితి కింద లెక్క. ఢిల్లీలోని మెజారిటీ ప్రాంతాల్లో దాదాపు అన్ని రోజులు ఏక్యూఐ 300కు పైనే నమోదవుతోంది. డిసెంబరులో ఒక దశలో ఏకంగా 432, 461కి చేరింది.
ఆ రెండే ఆదర్శం..
రెండున్నర దశాబ్దాల క్రితం బీజింగ్‌లో ఇదే సమస్యతో బాధపడ్డ చైనాను అనుసరించాలని ఢిల్లీ ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్’లోని ‘సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ రిసెర్చ్’కు చెందిన సురేశ్ రామసుబ్రమణ్య అయ్యర్ వంటి నిపుణులు సలహా ఇస్తున్నారు. అప్పట్లో బీజింగ్.. ఈ భూమ్మీదే అత్యంత దట్టమైన పొగమంచు, కాలుష్యంతో నిండిపోయిన నగరంగా ఉండేది. కాలుష్యాన్ని తగ్గించడానికి అధికారులు వాహన ఉద్గారాలపై, నిర్మాణపనులపై కఠిన ఆంక్షలు విధించారు. పాత, కాలంచెల్లిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిషేధించారు. ప్రజారవాణాను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చారు. పచ్చదనం పెంచారు. ఆ చర్యలు ఫలించడంతో 2010 నాటికి బీజింగ్‌లో గాలి నాణ్యత అద్భుతంగా మెరుగుపడింది. అలాగే.. సూరత్‌లోని పారిశ్రామికవాడల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా వాడిన ‘పార్టిక్యులేట్ మ్యాటర్ ఎమిషన్స్ ట్రేడింగ్’ విధానాన్ని.. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకూ వర్తింపజేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆ విధానంలో భాగంగా..గుజరాత్ ప్రభుత్వం సూరత్‌లోని ప్రతి పరిశ్రమకూ కాలుష్య ఉద్గారాలపై ఒక పరిమితి విధించింది. ఏదైనా ఒక పరిశ్రమ ఆ పరిమితిలోపే కాలుష్యకారకాలను విడుదల చేస్తే ఆ పరిశ్రమకు ప్రభుత్వం కొన్ని క్రెడిట్ పాయింట్లు ఇస్తుంది. దీంతో, సూరత్‌లో కాలుష్యం 20-30ు దాకా తగ్గినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
-సెంట్రల్ డెస్క్