నిరసనలతో వ్యాపారాలు విలవిల!
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:10 AM
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు, వాటివల్ల ప్రజల రాకపోకలపై విధిస్తున్న ఆంక్షల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వివిధ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి
ప్రధాని, సీజేఐ, రాహుల్‌గాంధీకి
వాణిజ్య, పారిశ్రామిక సంస్థల లేఖలు
న్యూఢిల్లీ, అక్టోబరు 14: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు, వాటివల్ల ప్రజల రాకపోకలపై విధిస్తున్న ఆంక్షల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వివిధ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. ప్రతి సంస్థ హక్కులను తాము గౌరవిస్తున్నామని.. అయితే ప్రస్తుత పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని.. నిరసనల తీరు, అవి చేపట్టే సమయం వల్ల తమ వ్యాపారాలు ప్రభావితం కాకుండా చూడాలని కోరాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీలకు గత మూడ్రోజుల్లో వేర్వేరుగా లేఖలు రాశాయి. న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్డీటీఏ) బుధవారం ప్రధానికి లేఖ రాసింది.వాణిజ్య ప్రదేశాల్లో స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా తమకు రక్షణ కల్పించాలని కోరింది. సర్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలను విరమించుకోవాలని రాహుల్‌గాంధీకి ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) లేఖ రాసింది.