ఢిల్లీలో 47 లక్షల ఓట్లు ఫట్!
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:44 AM
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) తొలిదశ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియలో 1.45 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లిన అధికారులు..
రేపు ‘సర్’ ముసాయిదా జాబితా విడుదల
న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) తొలిదశ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియలో 1.45 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లిన అధికారులు ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. అయితే.. వీరిలో 47.7 లక్షల మంది నుంచి ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి రాలేదని ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) తెలిపారు. దీంతో ముసాయిదా జాబితాలో 47.7 లక్షల మంది పేర్లను తొలగించనున్నట్టు వివరించారు. సోమవారం ముసాయిదా జాబితాను ప్రచురిస్తామని, మలిదశ ప్రక్రియలో భాగంగా.. అదే రోజు నుంచి అభ్యంతరాలు, క్లెయిములను స్వీకరిస్తామని తెలిపారు. అభ్యంతరాలకు సెప్టెంబరు 30వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. తుది జాబితాలను నవంబరు 4న వెలువరిస్తామన్నారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు.. సిబ్బందిని సంప్రదించవచ్చని సూచించారు. సోమవారం ప్రచురించనున్న ముసాయిదా జాబితాలో 97.5 లక్షల మంది ఓటర్ల వివరాలు ఉంటాయన్నారు. ఈ నెల 17న చేపట్టిన సర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాలను 67.18 శాతం మంది మాత్రమే తిరిగి ఇచ్చారని సీఈవో వివరించారు. మిగిలిన 47.7 లక్షల మంది నుంచి ఫారాలు అందలేదన్నారు. దీంతో వీరిని వలస, మృతులు, డూప్లికేట్ ఓటర్ల విభాగాల్లో ఉంచామన్నారు. కాగా, రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా 83.43 శాతం, తుగ్లకాబాద్ నియోజకవర్గంలో కనిష్ఠంగా 52.15 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. ఇదిలావుంటే, మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. ఓఖ్లా నియోజకవర్గంలో 45.32 శాతం, చాందినీ చౌక్‌లో 38.98, బల్లిమారన్ నియోజకవర్గంలో 32.65, ముస్తఫాబాద్‌లో 28.09, బాబర్‌పూర్‌లో 27, మాటియా మహల్‌లో 24.5, శీలంపూర్‌లో 23.37 శాతం మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి.