Share News

ఢిల్లీలో ‘బొద్దింకల’ హల్‌చల్‌

ABN , Publish Date - Sep 05 , 2026 | 05:38 AM

కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో మరోసారి నిరసనకు దిగింది. తమ కార్యకర్త తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన స్వతంత్ర భరద్వాజ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేయాలంటూ పార్లమెంటు స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించింది.

ఢిల్లీలో ‘బొద్దింకల’ హల్‌చల్‌

  • తమ కార్యకర్త తండ్రి మీద దాడి చేసిన స్వతంత్ర భరద్వాజ్‌ అరెస్టుకు డిమాండ్‌

  • పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన

  • బులంద్‌షహర్‌లో భరద్వాజ్‌ అరెస్టు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో మరోసారి నిరసనకు దిగింది. తమ కార్యకర్త తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన స్వతంత్ర భరద్వాజ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేయాలంటూ పార్లమెంటు స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్‌దాస్‌, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ అధినేత, ఎంపీ చంద్రశేఖర్‌ ఆజాద్‌ తదితరులతోపాటు సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. దీంతో 72 గంటల్లో స్వతంత్ర భరద్వాజ్‌ను పట్టుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు.. విస్తృతంగా గాలింపు జరిపి, కొన్ని గంటల్లోనే అరెస్టు చేశారు. తనను తాను కరడుగట్టిన హిందువుగా చెప్పుకొనే స్వతంత్ర భరద్వాజ్‌ అనే 21 ఏళ్ల యువకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన సీజేపీ నిరసన సందర్భంగా జూలై 20వ తేదీన నిషు ఆజాద్‌ అనే బాలిక తండ్రి సంజయ్‌కుమార్‌ మీద తాను చేసిన దాడి గురించి ఘనంగా చెప్పుకొన్నాడు. ‘సంజయ్‌ కుమార్‌ తల పగలగొట్టాను. అతడికి 60 కుట్లు పడ్డాయి. తన తండ్రికి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నిషు ఆజాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట చెప్పింది. కానీ, నన్నెవరకూ అరెస్టు చేయలేదు. ఎందుకంటే, ఢిల్లీ మంత్రి కపిల్‌మిశ్రా, కేంద్రమంత్రి చిరాగ్‌పాశ్వాన్‌, ప్రధాని మోదీ.. వీళ్లంతా నాకు పెద్దన్నలు. వీళ్లందరి మద్దతు నాకుంది’ అని పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారి.. ఢిల్లీ పోలీసుల మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. స్వతంత్ర భరద్వాజ్‌ వంటి గూండాలు జంతర్‌మంతర్‌కు వచ్చి నిరసనకారుల మీద హత్యాయత్నాలు చేస్తుంటే ఢిల్లీ పోలీసులు ఏం చేసినట్లు? ఈ గూండాలను గుర్తించి అరెస్టు చేయలేరా? అని సౌరవ్‌దాస్‌ ప్రశ్నించారు.

Updated Date - Sep 05 , 2026 | 05:40 AM