Share News

యువకుడిపై చేయి చేసుకున్న ఢిల్లీ మంత్రి

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:57 AM

ఢిల్లీ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ) మంత్రి పర్వేశ్‌ వర్మ ఓ యువకుడిపై బహిరంగంగా చేయి చేసుకోవడం దేశ రాజధానిలో కలకలం రేపింది.

యువకుడిపై చేయి చేసుకున్న ఢిల్లీ మంత్రి

  • కుటుంబాన్ని దూషించడం వల్లే కొట్టాల్సి వచ్చిందని వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: ఢిల్లీ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ) మంత్రి పర్వేశ్‌ వర్మ ఓ యువకుడిపై బహిరంగంగా చేయి చేసుకోవడం దేశ రాజధానిలో కలకలం రేపింది. పశ్చిమ ఢిల్లీలోని తిలక్‌నగర్‌ ప్రాంతంలో ఆదివారం రోడ్డు నాణ్యత తనిఖీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం రేగింది. తిలక్‌ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొత్తగా నిర్మించిన రహదారి నాణ్యతను పరిశీలించడానికి బీజేపీ మంత్రి పర్వేశ్‌ వర్మ వెళ్లారు. ఆ సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌తో పాటు స్థానికులు కొందరు.. రోడ్డు నాణ్యత అత్యంత అధ్వానంగా ఉందంటూ మంత్రిని నిలదీశారు. చేత్తో పట్టుకుంటేనే రోడ్డు ఊడిపోతోందంటూ వారు చూపించడంతో అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సోషల్‌ మీడియా బాధ్యతలు చూసే సాహెబ్‌ సింగ్‌ అనే యువకుడు రోడ్డు దుస్థితిని, జరుగుతున్న చర్చను తన ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంత్రి పర్వేశ్‌ వర్మ.. ఆ యువకుడి మొబైల్‌ను లాక్కొని, అతడి చెంపపై బలంగా కొట్టారు. దీనిపై ప్రతిపక్ష ఆప్‌తో పాటు, సీజేపీ తీవ్రంగా మండిపడింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌, ఆప్‌ నేత సౌరబ్‌ భరద్వాజ్‌ తదితరలు ఈ వీడియోను షేర్‌ చేస్తూ మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, ఈ వివాదంపై మంత్రి పర్వేశ్‌ వర్మ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఘటన సమయంలో అక్కడున్న ఆప్‌ కార్యకర్తలు తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి తీవ్రమైన బూతులు తిట్టారని, ఆ దుర్భాషల వల్లే తాను సహనం కోల్పోయి సదరు వ్యక్తిపై చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.

Updated Date - Sep 28 , 2026 | 05:58 AM