నేను తప్పుకోవాలని ఇంకెవరైనా దరఖాస్తు చేస్తారా?
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:43 AM
ఈ కేసు విచారణ నుంచి నేను తప్పుకోవాలని (రెక్యూసల్) ఇంకెవరైనా దరఖాస్తు చేయాలనుకుంటే చేసుకోండి. వాటన్నింటిపై ఒకేసారి నిర్ణయం వెలువరిస్తా..
అన్నింటిపై ఒకేసారి నిర్ణయం వెల్లడిస్తా
ఢిల్లీ మద్యం విధానం కేసు విచారణలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ‘ఈ కేసు విచారణ నుంచి నేను తప్పుకోవాలని (రెక్యూసల్) ఇంకెవరైనా దరఖాస్తు చేయాలనుకుంటే చేసుకోండి. వాటన్నింటిపై ఒకేసారి నిర్ణయం వెలువరిస్తా’ అని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తెలిపారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో నిందితులపై నమోదైన ఆరోపణలను దిగువ కోర్టు కొట్టేయటాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్.. సోమవారం జస్టిస్ స్వర్ణకాంతశర్మ సారథ్యంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా, కేజ్రీవాల్ సహా పలువురు దాఖలు చేసిన రెక్యూసల్ పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని సీబీఐకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు కేజ్రీవాల్ హాజరయ్యారు. రెక్యూసల్ పిటిషన్‌పై తానే స్వయంగా వాదనలు వినిపిస్తానని కోరారు. ప్రతివాదుల తరఫు న్యాయవాది షాదన్ ఫరాసత్ స్పందిస్తూ.. రెక్యూసల్ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ.. ‘మరెవరైనా ఇలాంటి దరఖాస్తులు చేయాలనుకుంటే చేయొచ్చు.. అన్నింటినీ కలిపి విచారిస్తా’ అని పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, కవిత, మనీశ్ సిసోడియాతోపాటు 23 మందికి క్లీన్ చిట్ ఇస్తూ ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 27న తీర్పునిచ్చింది. ఈ కేసులో దర్యాప్తు జరిపిన సీబీఐ అధికారిపై చర్యలకు ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనానికి ఈ కేసు విచారణను అప్పగించటంపై కేజ్రీవాల్ అభ్యంతరం తెలిపారు.