ట్రయల్ కోర్టు జడ్జి పరిధి దాటారా? లేదా?
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:17 AM
ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీవ్రంగా స్పందించారు. న్యాయమూర్తి తన పరిధిని దాటారా? లేదా? అనేది తేల్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
ఆయన వ్యాఖ్యలపై తేల్చాల్సి ఉంది
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ
మా వాదన వినకుండానే ఆ వ్యాఖ్యలా?
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆభ్యంతరం
600 పేజీల తీర్పు కాపీ చదవాలి
సమయం కావాలన్న నిందితులు
కేజ్రీవాల్, కవిత తదితరులకు నోటీసులు
తదుపరి విచారణ ఏప్రిల్ 2కు వాయిదా
న్యూఢిల్లీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీవ్రంగా స్పందించారు. న్యాయమూర్తి తన పరిధిని దాటారా? లేదా? అనేది తేల్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ట్రయల్ కోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ కేసుతో ఈడీకి సంబంధం లేనప్పటికీ, ఆ కేసులో పార్టీ కూడా కానప్పటికీ న్యాయమూర్తి తమపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడంపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయమూర్తి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని హైకోర్టుకు విన్నవించింది. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈడీ తరఫున ఏఎస్జీ ఎస్వీ రాజు, ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ.. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఈడీ దర్యాప్తుపై చేసిన వ్యాఖ్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని చెప్పారు. ‘‘పీఎంఎల్‌ఏ కింద ఈడీ స్వతంత్రంగా చేపట్టిన దర్యాప్తుకు సంబంధించిన పేరాలను తొలగించాలి. ఎందుకంటే అవి ‘న్యాయ పరిధిని అతిక్రమించడం’ కిందకు వస్తాయి. ఈడీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించకుండానే, కనీసం తమ వాదనలు వినే అవకాశం కూడా ఇవ్వకుండానే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆ వ్యాఖ్యలు ఎలా చేస్తారు? కేవలం సీబీఐ కేసులో అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయా? లేదా? అన్నది మాత్రమే ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి.
విడిగా జరుగుతున్న పీఎంఎల్‌ఏ దర్యాప్తుపై వ్యాఖ్యానించాల్సిన అవసరం న్యాయమూర్తికి ఏమాత్రం లేదు’’ అని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ఫండింగ్ లాంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు ఈడీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం ఊహలతో దర్యాప్తు సంస్థలపై చేసిన ఇటువంటి ‘విపరీతమైన వ్యాఖ్యల’ వల్ల వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టు వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ట్రయల్ కోర్టు జడ్జి తన పరిధి దాటారా? లేదా? అన్నది తేల్చాల్సి ఉందని జస్టిస్ స్వర్ణకాంత శర్మ అన్నారు. ‘‘నాకు అర్థం కావడం లేదు. విచారణాధికారి తన పరిధిని మించి వ్యవహరించారని ఈడీ చెబుతోంది. ఆ జడ్జి తన పరిమితులు దాటారో? లేదో? నేను తేల్చాల్సి ఉంది’’ అని జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యాఖ్యానించారు. కాగా, పిటిషన్‌పై స్పందించేందుకు తమకు వారం సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరగా, శర్మ అసహనం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్, కవిత సహా నిందితులందరికీ నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు. మరోసారి గడువు కోరవద్దని, 2లోపు సమాధానాలు సిద్ధంగా ఉండాలని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.