టెలిగ్రాంపై తాత్కాలిక నిషేధం సరైనదే!
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:08 AM
టెలిగ్రాం యాప్‌పై కేంద్రప్రభుత్వం తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఆదివారం నీట్ పరీక్ష నేపథ్యంలో పేపర్ లీకేజీ...
కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, జూన్ 19: టెలిగ్రాం యాప్‌పై కేంద్రప్రభుత్వం తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఆదివారం నీట్ పరీక్ష నేపథ్యంలో పేపర్ లీకేజీ, ప్రశ్నపత్రాల విక్రయం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ముఠాలను అడ్డుకోవటానికే టెలిగ్రాంను కొన్ని రోజులపాటు నిషేధించామన్న ప్రభుత్వ వాదనలను ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ తేజస్ కారియా తీర్పును వెలువరించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 69-ఏ ప్రకారం.. దేశ సమగ్రత, భద్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే ఏ చర్యనైనా అడ్డుకోవటానికి ఏదైనా ఆన్‌లైన్ కంటెంట్‌ను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు నిషేధాన్ని వ్యతిరేకిస్తూ టెలిగ్రాం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మరోవైపు, గత నెల 12వ తేదీన జరిగిన నీట్ పరీక్షను అకస్మాత్తుగా రద్దు చేయటం, ఆ తర్వాత అంతే హడావిడిగా రీఎగ్జామ్‌కు కొత్త తేదీని ప్రకటించటం వంటి ప్రభుత్వ నిర్ణయాలు విద్యార్థుల మీద తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగిస్తున్నాయని.. వీటిపై అత్యవసరంగా విచారణ జరపాలంటూ దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు నిరాకరించింది. టెలిగ్రాంపై నిషేధాన్ని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తప్పుబట్టారు. రోడ్డు మీద గుంతలు ఉంటే వాటికి మరమ్మతులు చేయటానికి బదులు ఆ రోడ్డునే మూసివేయటంలా ఇది ఉందన్నారు. మరోవైపు, యూపీకి చెందిన 17 ఏళ్ల సుహానీ యాదవ్ అనే నీట్ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రశ్నపత్రాలు విక్రయిస్తున్న విద్యార్థి అరెస్టు
నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల పేరిట విక్రయాలు జరుపుతున్న రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల ఆకాశ్ చౌదరి అనే విద్యార్థిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ‘పేపర్ మాఫియా’ అనే పేరుతో నిందితుడు టెలిగ్రాం ద్వారా.. ప్రశ్నపత్రానికి రూ.4,000 చొప్పున పలువురి నుంచి వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నీట్ అవకతవకల్లో మెడికల్ విద్యార్థుల ప్రమేయం కూడా ఉంటున్న నేపథ్యంలో..శని, ఆదివారాల్లో మెడికల్ కాలేజీలు, వైద్యసంస్థల్లోని విద్యార్థులకు అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వకూడదని జాతీయ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.