బారికేడ్లు ఎందుకు దాటారు?
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:14 AM
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా వ్యవహారశైలిపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అనుమతి లేని ప్రాంతంలో నిరసనకు దిగడం, పోలీసుల బారికేడ్లను దాటి వెళ్లడం వంటి చర్యలు శాంతిభద్రతల సమస్యలకు దారితీస్తాయని వ్యాఖ్యానించింది.
నాయకులే దాటితే.. మిగిలిన వారిని నియంత్రించడం కష్టం
విదేశాల్లో విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకం అయ్యాయ్
సీజేపీ నేతల తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి
మీరు జెన్‌జీ కాదు కదా అని వ్యాఖ్య
పిటిషన్ వెనక్కి తీసుకున్న నేతలు
న్యూఢిల్లీ, అక్టోబరు 21: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా వ్యవహారశైలిపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అనుమతి లేని ప్రాంతంలో నిరసనకు దిగడం, పోలీసుల బారికేడ్లను దాటి వెళ్లడం వంటి చర్యలు శాంతిభద్రతల సమస్యలకు దారితీస్తాయని వ్యాఖ్యానించింది. నిరసనల్లో నాయకులే బారికేడ్లను దాటితే, వారిని అనుసరించి ఇతరులు కూడా రావచ్చని, వారందరినీ నియంత్రించడం కష్టమవుతుందని పేర్కొంది. విదేశాల్లో(తాజాగా ఫ్రాన్స్‌లో) విద్యార్థుల ఆందోళనలు కాస్తా హింస, భవనాల దహనం వరకు వెళ్లిన ఉదంతాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా బుధవారం జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి లేకున్నా అక్కడికి వెళ్లడం, గతంలో ఇచ్చిన శాంతిభద్రతల హామీ పత్రాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కోర్టు ప్రశ్నలు సంధించింది. విచారణ సందర్భంగా నేతల వయసును కూడా హైకోర్టు ప్రశ్నించింది. సౌరవ్ వయసు 27 ఏళ్లు, అశుతోష్ వయసు 32 ఏళ్లు అని వారి తరఫు న్యాయవాది చెప్పారు. స్పందించిన ధర్మాసనం.. వీరేమీ జన్‌జీ కాదని వ్యాఖ్యానించింది. 1997 తర్వాత పుట్టిన వారిని మాత్రమే జెన్‌జీ అంటారని పేర్కొంది. తొలుత విద్యార్థుల ఆందోళనగా ప్రారంభమైన నిరసన ఇప్పుడు మరో అంశం చుట్టూ సాగుతోందని, నిరసనకారులు మారకపోయినా ఆందోళనకు కారణాలు మారుతున్నాయని కోర్టు పేర్కొంది.