Share News

ముస్లిం లా ప్రకారం పెళ్లి జరిగినా మైనర్‌ భార్యతో శృంగారం నేరమే

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:12 AM

ముస్లిం పర్సనల్‌ ప్రకారం 18 ఏళ్లలోపు వయసున్న బాలికను వివాహం చేసుకోవడం చట్టబద్ధమే అయినప్పటికీ, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని మాత్రం నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని..

ముస్లిం లా ప్రకారం పెళ్లి జరిగినా మైనర్‌ భార్యతో శృంగారం నేరమే

  • పోక్సో చట్టం కింద కేసు పెట్టొచ్చు: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: ముస్లిం పర్సనల్‌ ప్రకారం 18 ఏళ్లలోపు వయసున్న బాలికను వివాహం చేసుకోవడం చట్టబద్ధమే అయినప్పటికీ, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని మాత్రం నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్‌ బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణల మీద భర్తపై పోక్సో, బీఎన్‌ఎస్‌ల ప్రకారం కేసు పెట్టవచ్చని తెలిపింది. 16 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్న 28 ఏళ్ల యువకుడిపై పోక్సో చట్టం కింద నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ జస్టిస్‌ సంజీవ్‌ నారుల ఈ వ్యాఖ్య చేశారు. రెండు కుటుంబాల సమ్మతి మేరకు ఇద్దరికీ ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం వివాహం జరిగింది. పరస్పర అంగీకారంతో దంపతులిద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. 8నెలల గర్భందాల్చడంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మైనర్‌గా ఉండగానే తల్లి అవుతున్నట్టు గమనించిన అధికారులు భర్తపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. దీనిని కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, పర్సనల్‌ లా కేవలం సివిల్‌ వ్యవహారాలకు సంబంధించినదని, మైనర్‌ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకోవడం మాత్రం క్రిమినల్‌ చర్య అవుతుందని ధర్మాసనం తెలిపింది.

Updated Date - Sep 27 , 2026 | 07:17 AM