Share News

‘మద్యం కేసు’ను బదిలీ చేయడం కుదరదు

ABN , Publish Date - Mar 16 , 2026 | 03:39 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయడం కుదరదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

‘మద్యం కేసు’ను బదిలీ చేయడం కుదరదు

  • కేజ్రీవాల్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయడం కుదరదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఢిల్లీ మద్యం వ్యవహారానికి సంబంధించి సీబీఐ కేసులో కేజ్రీవాల్‌, సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఫిబ్రవరి 27న తీర్పునిచ్చింది. ఆ తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌ జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ట్రయల్‌ కోర్టు వ్యాఖ్యలపై జస్టిస్‌ శర్మ స్టే విధించారు. ఆ కేసు సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘మార్చి 9న జస్టిస్‌ శర్మ ఎటువంటి బలమైన కారణాలు చూపకుండానే ట్రయల్‌ కోర్టు వ్యాఖ్యలపై స్టే విధించారు. ఈ కేసులో ఈడీ పార్టీ కానప్పటికీ పీఎంఎల్‌ఏ విచారణను వాయిదా వేయాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించడం అనుమానం కలిగిస్తోంది. గతంలో జస్టిస్‌ శర్మ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో న్యాయమూర్తికి ముందే ఏదో ఒక అభిప్రాయం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. కాబట్టి కేసును నిష్పక్షపాతంగా విచారించే మరో ధర్మాసనానికి మార్చండి’’ అని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుత రోస్టర్‌ ప్రకారం ఈ పిటిషన్‌ను జస్టిస్‌ శర్మకే కేటాయించామని, విచారణ నుంచి తప్పుకోవాలా? లేదా? అనేది న్యాయమూర్తే నిర్ణయించుకోవాలని ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ స్పష్టం చేశారు. దీనిపై కేజ్రీవాల్‌, సిసోడియాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Updated Date - Mar 16 , 2026 | 03:39 AM