పోషించని పిల్లల్ని ఇంటి నుంచి పంపించేయొచ్చు
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:50 AM
పోషించకున్నా, అవమానించినా తమ ఇంటి నుంచి పిల్లల్ని, వారసులని పంపించేసే అధికారం వృద్ధులకు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
వృద్ధులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాలి: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబరు 2: పోషించకున్నా, అవమానించినా తమ ఇంటి నుంచి పిల్లల్ని, వారసులని పంపించేసే అధికారం వృద్ధులకు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే వారిని ఇంటి నుంచి ఖాళీ చేయించేలా ఆదేశించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపింది. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007లోని సెక్షన్లు 22, 32 ప్రకారం ఈ నిర్ణయం సబబేనని తెలిపింది. పూనం అనే మహిళ అత్తింటివారిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆ చట్టం ప్రకారమే తన నివాసం కోసం అత్త ఇంటిలో కొంత చోటును కేటాయించాలని కోరింది. మరోవైపు సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం బాగోగులు చూడని పూనంను తన ఇంటి నుంచి పంపించేయాలని ఆ అత్త ఢిల్లీ డివిజనల్ కమిషనర్‌కు దరఖాస్తు చేశారు. అన్నింటినీ పరిశీలించి ఇల్లు ఖాళీ చేయాలంటూ కోడలు పూనంను డివిజనల్ కమిషనర్ ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ పూనం హైకోర్టుకు వెళ్లారు.