మహిళపై కూడా గ్యాంగ్రేప్ కేసు పెట్టొచ్చు
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:49 AM
సామూహిక అత్యాచారం కేసుల్లో మహిళలను కూడా నేరస్తులుగా గుర్తించే విషయంలో ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.
మహిళ అత్యాచారం చేయలేదన్న కారణంతో తప్పించుకోలేరు ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
న్యూఢిల్లీ, అక్టోబరు 15: సామూహిక అత్యాచారం కేసుల్లో మహిళలను కూడా నేరస్తులుగా గుర్తించే విషయంలో ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఒక మహిళ మరో మహిళపై లైంగికదాడికి పాల్పడే అవకాశం లేకపోయినప్పటికీ.. ఆ నేరానికి సహకరిస్తే సదరు మహిళపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేయవచ్చని గురువారం తీర్పు చెప్పింది. సామూహిక అత్యాచారం కేసు నుంచి తన పేరును తొలగించాలని ఓ మహి ళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ అనూప్ జైరాం భంభానీ నేతృత్వంలోని ధర్మాసనం ఐపీసీలోని సెక్షన్ 376 (డీ)కి స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ఒకే ఉద్దేశంతో ఒక్కరు లేదా ఎక్కువమంది కలిసి నేరానికి పాల్పడటాన్ని ఈ సెక్షన్ నేరంగా పరిగణిస్తోందని, ఇందు లో మహిళలకు మినహాయింపు ఏమీ లేదని పేర్కొంది. ఒక మహిళపై మరో మహిళ లైంగికదాడికి పాల్పడటం భౌతికంగా సాధ్యకాదు కాబట్టి.. ఆ కేసు నుంచి తప్పించాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. భౌతికంగా లైంగికదాడికి పాల్పడకపోయినా.. సహ నిందితులను అందుకు ప్రోత్సహించటం, సహాయం చేయటం, సామూహిక లైంగి క దాడి కుట్రలో పాలుపంచుకోవటం వంటి చర్యలకు పాల్పడే మహిళలపై సామూహిక లైంగికదాడి అభియోగాలు మోపవచ్చని స్పష్టంచేసింది. ఈ తీర్పుతో ఇప్పటివరకూ సామూహిక లైంగిక దాడి కేసుల్లో ఉన్న అస్పష్టత తొలగిపోయిందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపై మహిళ అన్న కారణంగా ఈ నేరాల్లో భాగస్వాములైన నిందితులు తప్పించుకోలేరని వ్యాఖ్యానిస్తున్నారు.