Share News

సీజేపీ ఎక్స్‌ ఖాతా అన్‌బ్లాకింగ్‌కు ఆదేశాలివ్వం

ABN , Publish Date - May 30 , 2026 | 03:20 AM

కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాను అన్‌బ్లాక్‌ చేసేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేసేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది...

సీజేపీ ఎక్స్‌ ఖాతా అన్‌బ్లాకింగ్‌కు ఆదేశాలివ్వం

  • జూలై 7లోపు కమిటీ నిర్ణయం తీసుకోవాలి: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ, మే 29 : కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాను అన్‌బ్లాక్‌ చేసేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేసేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కానీ, సీజేపీ ఎక్స్‌ ఖాతా అంశంలో తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా పరిశీలన చేయాలని రివ్యూ కమిటీని ఆదేశించింది. ఐటీ చట్టాలకు లోబడి పని చేసే రివ్యూ కమిటీ జూలై 7వ తేదీ లోగా న్యాయస్థానానికి తన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. అంతేకాక, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే రివ్యూ కమిటీ ముందు వర్చువల్‌గా హాజరయ్యేందుకు జస్టిస్‌ పురుషేంద్ర కుమార్‌ కౌరవ్‌ ధర్మాసనం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఎక్స్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 7కు వాయిదా వేసింది. సీజేపీ ఎక్స్‌ ఖాతాను బ్లాక్‌ చేస్తూ కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ అభిజీత్‌ దీప్కే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ పురుషేంద్ర కుమార్‌ కౌరవ్‌ ధర్మాసనం శుక్రవారం విచారించింది. అభిజీత్‌ దీప్కే తరఫున సీనియర్‌ న్యాయవాది అఖిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ.. సీజేపీ ఖాతా పూర్తిగా విమర్శనాత్మక ఖాతా అని, అందులో ఏమైనా అభ్యంతరకరమైన ట్వీట్లు ఉంటే వాటిని మాత్రమే బ్లాక్‌ చేయాలని, మొత్తం ఖాతానే బ్లాక్‌ చేయడం సరికాదని పేర్కొన్నారు. సీజేపీ ఎక్స్‌ ఖాతా అన్‌బ్లాక్‌ చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన జస్టిస్‌ కౌరవ్‌.. బ్లాకింగ్‌ ఆదేశాలు రికార్డుల్లో కూడా లేవని, కేంద్రం తన వైఖరి తెలియజేసిన తర్వాత తగిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - May 30 , 2026 | 03:20 AM