కుమారుడి పోషణ బాధ్యత తండ్రిదే
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:06 AM
భార్యాబిడ్డలను పోషించాల్సిన బాధ్యత భర్తపై ఉందని, నిరుద్యోగినన్న కారణం చూపి ఆ కర్తవ్యం నుంచి తప్పించుకోలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
నిరుద్యోగినన్న పేరుతో తప్పించుకోలేరు: ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ, జూన్ 6: భార్యాబిడ్డలను పోషించాల్సిన బాధ్యత భర్తపై ఉందని, నిరుద్యోగినన్న కారణం చూపి ఆ కర్తవ్యం నుంచి తప్పించుకోలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కుమారుడు మేజర్ అయ్యే వరకు పోషణ నిమిత్తం ప్రతి నెలా రూ.6,000 చెల్లించాలని ఓ తండ్రిని ఆదేశించింది. పని చేసే శక్తిసామర్థ్యాలు ఉన్నందున అంత మొత్తాన్ని చెల్లించకతప్పదని తెలిపింది. అదనపు కట్నం కోసం తనను భర్త, అత్తింటివారు వేధిస్తున్నారంటూ ఓ మహిళ 2013లో గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. 2015నుంచి మైనర్ అయిన కుమారుడితో కలిసి విడిగా ఉంటోంది. అయితే శారీరక వేధింపుల విషయమై ఎలాంటి రికార్డులు సమర్పించకపోవడంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. కానీ, కుమారుడు ఆమె వద్ద పెరుగుతున్న విషయాన్ని గుర్తించి ఆ బాలుడి పోషణ నిమిత్తం ప్రతి నెలా సొమ్ము ఇవ్వాలని ఆదేశించింది. నిరుద్యోగినన్న కారణం చూపి చెల్లించలేననడం సరికాదని తెలిపింది.