Share News

Prannoy and Radhika Roy in IT Assessment Case: ప్రణయ్‌ రాయ్‌ దంపతులకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:22 AM

ఐటీ ఉత్తర్వులకు సంబంధించి ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌ దంపతులకు ఊరట లభించింది.

Prannoy and Radhika Roy in IT Assessment Case: ప్రణయ్‌ రాయ్‌ దంపతులకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

న్యూఢిల్లీ, జనవరి 19: ఐటీ ఉత్తర్వులకు సంబంధించి ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌ దంపతులకు ఊరట లభించింది. ఆదాయ పన్ను విభాగం ఈ ఇద్దరికి ఐటీ పునర్‌ మదింపునకు సంబంధించి జారీచేసిన నోటీసులను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్‌ దినేశ్‌ మెహతా, వినోద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఐటీ విభాగం ప్రణయ్‌, రాధిక దంపతులకు రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని నిర్దేశించింది. ఎన్డీటీవీ ప్రమోటర్‌ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 2009-10లో టీవీ నెట్‌వర్క్‌ వడ్డీలేకుండా రూ.404 కోట్ల రుణాన్ని అందజేసిన అంశమ్మీద ఐటీ విభాగం నుంచి పన్ను ఎగవేత ఆరోపణలొచ్చాయి. దీనిపై 2016లో ప్రణయ్‌, రాధికలకు ఐటీ విభాగం సదరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ పునర్‌ మదింపు చేయాలని నోటీసులు జారీచేసింది. దీన్ని ప్రణయ్‌, రాధిక దంపతులు 2017లో ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంఽధించి 2011లో పునర్‌ మదింపు ప్రక్రియ ప్రారంభించి 2013లో ముగించారని కక్షిదారులు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే దీనిపైనే 2016 మార్చి 31న మళ్లీ ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. ఆదాయపన్ను నిబంధనల ప్రకారం ఒకే కేసులో రెండోసారి ఐటీ పునర్‌ మదింపు ప్రక్రియ కోసం నోటీసులు జారీ చేయడం చెల్లదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. నోటీసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల క్రితమే ఆ కేసు ముగిసిందని.. మళ్లీ నోటీసులివ్వడం వేధించడమేనని వ్యాఖ్యానించింది.

Updated Date - Jan 20 , 2026 | 01:22 AM