నిరసనలపై నిప్పురవ్వలు
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:15 AM
ఢిల్లీలో జెన్‌జీ ఉద్యమం.. ఫ్రాన్స్‌లో అసమ్మతి ఆందోళనలు.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎగసిపడుతున్న నిరసనలు.. చూడటానికి వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు కారణాలతో ఇవన్నీ జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, అక్టోబరు 22: ఢిల్లీలో జెన్‌జీ ఉద్యమం.. ఫ్రాన్స్‌లో అసమ్మతి ఆందోళనలు.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎగసిపడుతున్న నిరసనలు.. చూడటానికి వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు కారణాలతో ఇవన్నీ జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ, వాటన్నింటి మధ్య సారూప్యతలు ఉన్నాయంటూ అంతర్జాతీయ డిజిటల్ వార్త సంస్థ ‘ఫాక్స్ న్యూస్’ సంచలన కథనం ప్రచురించింది. ఈ ఆందోళనలకు అనుకూల వాతావరణం (ఎకో సిస్టమ్) కల్పించేందుకు 13 దేశాలకు చెందిన 101 సంస్థలు పని చేస్తున్నాయని తెలిపింది. ప్రధానంగా వార్తా కథనాలు, సోషల్ మీడియా ప్రచారం, రాజకీయ సందేశాల రూపంలో ఈ సంస్థలు చురుగ్గా ఉన్నాయని వివరించింది. కమ్యూనిస్టు, సోషలిస్టు సంస్థలు, లేబరు, విద్యార్థి సంఘాలు, సామాజిక గ్రూపులు, కొన్ని మీడియా సంస్థలు ఇందులో ఉన్నాయని పేర్కొంది. ఫ్రాన్స్, ఢిల్లీల్లో ఉద్యమాలకు మరింత ఆజ్యం పోసేలా, వాటిని అవి సమన్వయపరుస్తున్నాయని, సంఘటితం చేస్తున్నాయని విశ్లేషించింది. దీనిపై తమ జర్నలిస్టు అస్రా క్యూ నోమనీ రాసిన పరిశోధనాత్మక కథనాన్ని ఆ వార్తా సంస్థ ప్రచురించింది. ‘దేశాంతరాల్లో ఉద్యమాలకు అనుకూల వాతావరణం’ కల్పించడం ఈ సంస్థల లక్ష్యమని తెలిపింది. ఉద్యమవార్తలను సరిహద్దులు దాటించడంతోపాటు, స్థానికంగా వేర్వేరు కారణాలతో బాధితులుగా ఉన్న ప్రజలతో ఆ ఉద్యమాలను అనుసంధించేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. తాను పరిశోధనను ప్రారంభించినప్పుడు.. ఫ్రాన్స్ ఆందోళనలతో 50 సంస్థలకు సంబంధాలుంటే, ఈ నెల 19 నాటికి 54కు, 20 నాటికి ఆ సంఖ్య 101కు చేరిందని అస్రా క్యూ నోమనీ తెలిపారు. ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ అలయెన్స్ పారిస్ (ఐఏపీ) అనే సంస్థ... ఫ్రాన్స్, ఢిల్లీ ఆందోళనలకు మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తోందన్నారు.
ప్రొగ్రెసివ్ ఇంటర్నేషనల్ మరో దేశాంతర రాజకీయ సంస్థ. ఫ్రాన్స్, భారత్, స్పెయిన్, అల్బేనియా తదితర దేశాల్లో జరుగుతున్న ఉద్యమాలకు లక్ష్యాన్ని నిర్దేశించేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. కమ్యూనిస్టు, సోషలిస్టు గ్రూపులతో సంబంధం కలిగిన షాంఘైకు చెందిన వివాదాస్పద వ్యాపారవేత్త నెవిల్లే రాయ్ సింఘమ్ ప్రస్తావన ఈ కథనంలో కనిపించింది. ప్రొగ్రెసివ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులను కాంగ్రెస్ నాయకులు కలుసుకోవడం, ఆ తర్వాతే నవంబరు 1 ఆందోళనలకు ప్రణాళిక తయారు కావడాన్ని ‘ఫాక్స్ న్యూస్’ తన కథనంలో ప్రస్తావించింది. ఢిల్లీ 10 జనపథ్‌లో సోనియా, రాహుల్‌ను ఆ సంస్థ ప్రతినిధులు గత ఏడాది ఏప్రిల్‌లో కలిశారు.