9 మంది సజీవ దహనం!
ABN , Publish Date - May 04 , 2026 | 03:50 AM
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ నివాస భవనంలో రేగిన మంటల్లో చిక్కుకొని..
ఢిల్లీలో ఏసీ అవుట్‌డోర్ యూనిట్ పేలి నివాస భవనంలో మంటలు
న్యూఢిల్లీ, మే 3 : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ నివాస భవనంలో రేగిన మంటల్లో చిక్కుకొని.. ఏడాదిన్నర చిన్నారి సహా తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. వీరిలో పలువురు స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యూఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న ఓ నాలుగంతస్తుల నివాస భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవనం రెండో అంతస్తులోని ఏసీ అవుట్ డోర్ యూనిట్‌లో జరిగిన పేలుడే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఈ పేలుడు వల్ల షార్ట్ సర్క్యూట్ జరగ్గా.. భవనంలోని కొన్ని ఇళ్ల ప్రధాన ద్వారాలకు అమర్చి ఉన్న స్మార్ట్‌లాక్‌లు జామ్ అయ్యాయి. దీంతో తలుపులు తెరుచుకోక ఇళ్లల్లో చిక్కుకొని పలువురు అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ భయానక ఘటనకు సంబంధించి స్థానికులు, అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వివేక్ విహార్ ప్రాంతంలోని ఓ నాలుగంతస్తుల భవనంలో ఒక్కో అంతస్తులో రెండేసి ఇళ్లు ఉండగా.. ఎనిమిది కుటుంబాలు నివాసముంటున్నాయి. భవనం అంతటికి ఒక లిఫ్ట్, ఒకేఒక్క మెట్ల మార్గంఉంది. అయితే, ఆదివారం తెల్లవారుజామున 3:40 గంటల సమయంలో రెండో అంతస్తులోని ఓ ఏసీ అవుట్ డోర్ యూనిట్ నుంచి మంటలు రావడాన్ని ఓ డెలివరీ బాయ్ గుర్తించాడు. ఆ యూనిట్‌లో తొలుత పేలుడు సంభవించి షార్ట్ సర్క్యూట్ జరిగి భవనమంతా మంటలు వ్యాపించాయి. భవనంలోని ఇళ్లలో చెక్కతో చేసిన అలంకరణ సామగ్రి వల్ల మంటలు మరింత చెలరేగాయి. భవనమంతా పొగ కమ్మేయగా.. అగ్నికీలలు ఎగసిపడ్డాయి. లోపల ఇరుక్కున్న వారు సాయం కోసం ఆర్తనాదాలు పెట్టినా ఫలితం లేకపోయింది. అగ్నిప్రమాదంపై ఉదయం నాలుగు గంటల సమయంలో సమాచా రం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.
10 అగ్నిమాపక యంత్రాల సాయంతో ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలోని ఇంటి బాల్కనీలకు ఏర్పాటు చేసుకున్న ఇనుప గ్రిల్స్, పక్షులు ఇళ్లలోకి రాకుండా ఏర్పాటు చేసుకున్న వలలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించాయి. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత మొదటి అంతస్తులో ఒకటి, రెండో అంతస్తులో ఐదు, మెట్ల మార్గంలో మూడు మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల రెండో అంతస్తులోని ఓ ఇంటికి ఉన్న స్మార్ట్ లాక్ జామ్ అయ్యింది. దీంతో ఆ ఇంట్లోని అరవింద్ జైన్(60), ఆయన భార్య అనిత జైన్ (58), వారి కుమారుడు నిషాంత్ జైన్(35) నిషాంత్ భార్య ఆంచల్ జైన్(33), అరవింద్ జైన్ మనమడు ఆకాశ్ జైన్ (ఏడాదిన్నర) అనే చిన్నారి లోపలి ఇరుక్కుపోయి మంటల్లో కాలిపోయారు. అలాగే, మొదటి అంతస్తులో శిఖా జైన్(45) అనే మహిళ మరణించగా ఆమె భర్త నవీన్ జైన్ (48) గాయాలతో బయటపడ్డారు. స్మార్ట్ లాక్ జామ్ అవ్వడం వల్లే వీరు కూడా ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయినట్టు చెబుతున్నారు. ఇక, మూడో అంతస్తులోని మెట్ల మార్గంలో నితిన్ జైన్(50), షైలీ జైన్(48), కుమారుడు సామ్యక్ జైన్(25) సజీవ దహనమయ్యారు. మేడ మీదకు వెళ్లే గేటుకు తాళం వేసి ఉండగా.. పైకి వెళ్లలేకపోయిన వీరు పొగ వల్ల స్పృహ కోల్పోయారు. ఆపై, మంటల్లో దహనమయ్యారు. కాగా, ఈ ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ తరన్‌జీత్ సింగ్ సంధూ, సీఎం రేఖా గుప్తా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.