Share News

ఢిల్లీలో పెట్రోల్‌ ద్విచక్ర వాహనాలకు చెక్‌!

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:24 AM

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలో పెట్రోల్‌ ద్విచక్ర వాహనాలకు చెక్‌!

  • 2028 ఏప్రిల్‌ నుంచి రిజిస్ట్రేషన్లు బంద్‌

  • రూ.30 లక్షల్లోపు ఈవీ కార్లకు ఏ పన్నుల్లేవ్‌

  • ఈవీల కొనుగోలుదారులకు భారీ సబ్సిడీలు

  • కొత్త ఈవీ పాలసీకి క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ, జూన్‌ 29: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి ఢిల్లీని పూర్తి స్థాయి ఈవీ నగరంగా మార్చడమే లక్ష్యంగా కొత్త ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ) పాలసీ 2.0కి క్యాబినెట్‌ సోమవారం ఆమోదముద్ర వేసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం తర్వాత జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త పాలసీ.. 2030 మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది. ఈ పాలసీ మేరకు.. 2028 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పెట్రోల్‌ ద్విచక్ర వాహనాల (బైక్‌లు, స్కూటర్లు) రిజిస్ట్రేషన్ల ను పూర్తిగా నిలిపేయనున్నారు. అంతకుముందే 2027 జనవరి 1 నుంచి పెట్రోల్‌/సీఎన్‌జీ త్రీ వీలర్ల (ఆటో రిక్షా) రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. అంటే ఈ నిర్దేశిత తేదీల తర్వా త కేవలం ఈవీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అయితే ఇప్పటికే ఉన్న పాత పెట్రోల్‌ వాహనాలను వాడుకోవచ్చు. ఇక రూ.30 లక్షల్లోపు ఎక్స్‌ షో రూమ్‌ ధర కలిగిన ఎలక్ట్రిక్‌ కార్లకు 100శాతం రహదారి పన్ను, రిజిస్ట్రేషన్‌ పన్నుల నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు. అంతకుముందు ముసాయిదా బిల్లులో పేర్కొన్న మేరకు హైబ్రిడ్‌ కార్లకు ప్రతిపాదించిన 50శాతం రాయితీని ఎత్తేశారు. కొత్త పాలసీలో ఈవీ కొనుగోలుదారులకు భారీ సబ్సిడీలను ప్రకటించారు. ఈవీ ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు మొదటి సంవత్సరం 30 వేలు, రెండో ఏడాది 20 వేలు, మూడో ఏడాదిలో రూ.10 వేల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే త్రిచక్ర వాహనాల కొనుగోలుదారులకు తొలి ఏడాది 50 వేలు, రెండో ఏడాది 40 వేలు, మూడో ఏడాదిలో 30 వేల వరకు రాయితీ ఉంటుంది. కొత్తగా కొనుగోలు చేసే లైట్‌ కమర్షియల్‌ ఈ-ట్రక్కులకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు సబ్సిడీ అందనుంది. బీఎస్‌-4 లేదా అంతకంటే పాత కా ర్లను తుక్కుగా మార్చి.. ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారే వారికి రూ.లక్ష స్ర్కాపేజ్‌ ప్రోత్సాహకం కూడా లభించనుంది.

రూ.15 వేల కోట్ల కేటాయింపు..

వచ్చే నాలుగేళ్లలో ఈ సరికొత్త ఈవీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఢిల్లీ సర్కారు రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో రూ.7 వేల కోట్లను ఈవీల కొనుగోలుదారులకు సబ్సిడీలుగా ఇవ్వనుంది. మిగిలిన రూ.8 వేల కోట్లతో ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 30 వేల కొత్త ఈవీ చార్జింగ్‌ పాయింట్లతో పాటు మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయనున్నారు.

Updated Date - Jun 30 , 2026 | 04:24 AM