ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొట్టి లోపలికెళ్లిన కారు!
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:34 AM
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ గేటు ముందున్న బారికేడ్‌ను బద్దలు కొట్టి ఒక ఎస్‌యూవీ వాహనం లోపలికి ప్రవేశించటం కలకలం రేపింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ గేటు ముందున్న బారికేడ్‌ను బద్దలు కొట్టి ఒక ఎస్‌యూవీ వాహనం లోపలికి ప్రవేశించటం కలకలం రేపింది. తీవ్ర భద్రతా ఉల్లంఘనగా భావిస్తున్న ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో.. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ ఎస్‌యూవీ వాహనం అసెంబ్లీ రెండవ నెంబరు గేటుకు అడ్డంగా ఉన్న బారికేడ్‌ను ఢీకొడుతూ ప్రాంగణంలోకి ప్రవేశించింది. దాంట్లోంచి ఓ వ్యక్తి బయటకొచ్చి.. స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం ముందు నిలిపి ఉంచిన అధికారిక వాహనం తలుపు తెరిచి లోపల ఓ పుష్పగుచ్ఛం, పూలదండ పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన వాహనంలోనే బయటకు వెళ్లిపోయాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసు బృందాలు, బాంబు నిర్వీర్యదళం, డాగ్ స్క్వాడ్స్ హుటాహుటిన వచ్చి.. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. పేలుడు పదార్థాలు ఏమీ లేవని అధికారులు నిర్ధారించారు. మరోవైపు, సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు సదరు వాహనం యూపీకి చెందినదని గుర్తించారు. కాగా, ఎస్‌యూవీని నడిపిన వ్యక్తి పేరు సరబ్‌జీత్‌సింగ్ అని, యూపీలోని పిలిబిత్‌కు చెందినవాడని కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. సరబ్‌జీత్‌సింగ్‌కు మానసిక ఆరోగ్య సమస్యలున్నాయని పేర్కొన్నాయి.