ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 100 అంతర్జాతీయ విమానాల రద్దు
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:39 AM
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో విమానయాన కంపెనీలు ఆ ప్రాంతానికే కాకుండా ఇతర ప్రాంతాలకు భారీ స్థాయిలో తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి.
న్యూఢిల్లీ, మార్చి 1: పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో విమానయాన కంపెనీలు ఆ ప్రాంతానికే కాకుండా ఇతర ప్రాంతాలకు భారీ స్థాయిలో తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకున్నారు. ఎయిర్ ఇండియా పశ్చిమాసియాలోని దేశాలకు అన్ని విమానాలను రద్దు చేసింది. ఎయిర్ ఇండియా 50 అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. సంస్థ రద్దు చేసిన వాటిలో ముంబై-లండన్, ఢిల్లీ-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-అమ్‌స్టర్‌డామ్, ఢిల్లీ-జూరిచ్, ఢిల్లీ-మిలాన్, ఢిల్లీ-వియన్నా, బెంగళూరు-లండన్(హీత్రూ), ఢిల్లీ-కోపెన్‌హాగెన్, ఢిల్లీ-లండన్ (హీత్రూ), ఢిల్లీ-ఫ్రాంక్‌ఫర్ట్, ఢిల్లీ-న్యూయార్క్, ముంబై-న్యూయార్క్, ముంబై-నెవార్క్, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-టొరంటో, ముంబై-ఫ్రాంక్‌ఫర్ట్, ఢిల్లీ-పారిస్ మధ్య రాకపోకలు సాగించే విమానాలు కూడా ఉన్నాయి. ఆదివారం ఢిల్లీ విమానాశ్రయంలో కనీసం 100 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఇందులో 60 వెళ్లే, 40 వచ్చే విమానాలున్నట్టు తెలుస్తోంది. ఇక చెన్నై, గల్ఫ్ దేశాల మధ్య 18 అంతర్జాతీయ విమానాలు రద్దయినట్టు చెన్నై విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. దుబాయి-తిరుచిరాపల్లి సెక్టార్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆదివారం రద్దయినట్టు తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్ట్ పేర్కొంది. కేరళలోని నాలుగు విమానాశ్రయాల నుంచి గల్ఫ్‌కు వెళ్లాల్సిన మెజారిటీ విమానాలు రద్దయ్యాయి. గల్ఫ్ దేశాలకు తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 37 అంతర్జాతీయ విమానాలు శనివారం మధ్యాహ్నం నుంచి రద్దయ్యాయి. ఇందులో ఆదివారానికి సంబంధించిన 26 విమానాలున్నాయి. కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన ఆరు విమానాలు ఆదివారం రద్దయ్యాయి. కొచ్చిన్ విమానాశ్రయం నుంచి 35, కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి గల్ఫ్‌కు వెళ్లే దాదాపు 10 విమానాలు రద్దయ్యాయి. కాగా పశ్చిమాసియాలోని పలు దేశాలు తమ గగనతలాలను మూసివేయడం వల్ల ఆదివారం 444 అంతర్జాతీయ విమానాలను దేశీయ విమానయాన సంస్థలు రద్దు చేసే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది.