దేశీయంగా కంటైనర్ల తయారీకి రూ.10,000 కోట్లు
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:30 AM
కేంద్ర బడ్జెట్‌లో కంటైనర్ల తయారీ పథకానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.10,000 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో కంటైనర్ల తయారీ పథకానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.10,000 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ఇంతవరకు వీటి తయారీపై కేంద్రం గట్టిగా దృష్టి పెట్టలేదు. అయితే సరకు రవాణాలో వీటి ప్రాధాన్యం ఎంతో ఉంది. భౌగోళిక రాజకీయ వ్యూహం వల్ల కూడా వీటి తయారీపై కేంద్రం దృష్టి సారించింది. ఎందుకంటే వీటి తయారీలో చైనాకు గుత్తాధిపత్యం ఉంది. అమెరికానూ ఈ విషయంలో ఆ దేశం ఇరుకున పెట్టింది. ఒకవేళ మన దేశంలో వీటికి కొరత ఏర్పడితే మన విదేశీ వాణిజ్యం దెబ్బతినడం ఖాయం. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చింది.
తయారీ అంతా అక్కడే..
సరకు రవాణాలో కంటైనర్లు ఎంతో అవసరం. అలాగే విదేశీ వాణిజ్యంలో నౌకాయానం ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా పరిమాణంలో 95 శాతం, విలువలో 70ు వర్తకానికి నౌకాయానమే ఆధారం. దేశంలో 12కు పైగా మెగా.. 200కు పైగా చిన్న పోర్టుల నుంచి సరకు రవాణా జరుగుతుండగా.. ఇందుకు కంటైనర్లే పూర్తిగా ఆధారం. వీటి కొరత సరకు రవాణాపై ప్రభావం చూపుతుంది. కాగా ప్రపంచంలో వీటి తయారీ 95 శాతం చైనాలోనే జరుగుతోంది. మొత్తంగా చైనాలో తయారయ్యే కంటైనర్ల సంఖ్య 50 లక్షల యూనిట్లకన్నా ఎక్కువే ఉంది. ఇక మన దేశంలో ఏటా 30,000 యూనిట్లు మాత్రమే తయారవుతున్నాయి. చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం కారణంగా గత ఏడాది చైనా వద్ద పెద్దసంఖ్యలో కంటైనర్లు ఉండిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వీటి ధరలు 30 శాతం పెరిగే అవకాశం ఉందని భావించారు. ఈ కారణంగా దేశంలోనూ వీటి తయారీపై దృష్టి పెట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రం ప్రస్తుతం ఇందుకు నిధులు కేటాయించినందున కంటైనర్ల తయారీ ఊపందుకునే అవకాశం ఉంది.