కస్టడీలో కొట్టిచంపడం పోలీసుల డ్యూటీ కాదు
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:39 AM
పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను కొట్టడం, హింసించడమనేది పోలీసుల అధికారిక విధి కిందకు రాదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది..
నిందితులైన పోలీసులను శిక్షించేందుకు సర్కారు అనుమతి అవసరం లేదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
భోపాల్, జూన్ 18: పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను కొట్టడం, హింసించడమనేది పోలీసుల అధికారిక విధి కిందకు రాదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉన్న పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు 24 ఏళ్ల ఇండోర్ జిల్లా కోర్టు ఉద్యోగి పంకజ్ వైష్ణవ్ కస్టడీ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను జస్టిస్ గజేంద్రసింగ్ కొట్టివేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సభ్య సమాజంలో కస్టోడియల్ మరణాలు అనేవి అత్యంత ఘోరమైన నేరాలు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, రికార్డులను ఫోర్జరీ చేయడం పోలీసుల విధి నిర్వహణ కిందకు రానే రావు’ అని స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదికలో సైతం పోలీసుల హింస వల్ల గాయాలయ్యాయని తేలిందని ప్రస్తావించారు.