Share News

బ్యారెల్‌ చమురు.. 100 డాలర్లకు?

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:40 AM

ఇరాన్‌ ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రం దెబ్బకు హోర్ముజ్‌ జలసంధిలో ఆయిల్‌ ట్యాంకర్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలగడంతో..

బ్యారెల్‌ చమురు.. 100 డాలర్లకు?

  • పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరిగే ముప్పు ఉందని ఆందోళన

న్యూఢిల్లీ, మార్చి 2: ఇరాన్‌ ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రం దెబ్బకు హోర్ముజ్‌ జలసంధిలో ఆయిల్‌ ట్యాంకర్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలగడంతో.. ఆ ప్రభావం చమురు, ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) సరఫరాపైన, ధరలపైన వెంటనే కనిపించింది! అమెరికా చమురు 7.6 శాతం మేర పెరిగి.. బ్యారెల్‌ 72.12 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్‌ ముడిచమురు ధర 8.6 శాతం మేర పెరిగి బ్యారెల్‌ 79.11 డాలర్లకు చేరుకుంది. యూరప్‌ దేశాలకు అతిపెద్ద సహజవాయువు సరఫరాదారు అయిన ఖతార్‌.. ఉత్పత్తిని నిలిపివేయడంతో యూర్‌పలో సహజవాయువు ధర 40 శాతానికి పైగా పెరిగింది. చమురు ధరలు పెరిగితే.. దాని ప్రభావం సరకు రవాణాపై పడి అన్ని రకాల వస్తువుల ధరలూ పెరిగే ప్రమాదం ఉంది. మన చమురు అవసరాలు తీర్చుకోవడానికి 85 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధారపడతాం కాబట్టి.. చమురు కొనుగోలు ఖర్చు పెరిగి మన విదేశీ మారక నిల్వలు కరిగిపోతాయి. చమురు కోసం మనం ఎక్కువ డాలర్లు ఖర్చు చేస్తే రూపాయి విలువ పడిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని త్వరగా అదుపుచేయకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ ఏడాది నవంబరులో అమెరికాలో మిడ్‌టర్మ్‌ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. త్వరలోనే చమురు ధరలు తగ్గేలా చేయడానికి ట్రంప్‌ ప్రయత్నాలు చేస్తారని బెరెన్‌బెర్గ్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ హోల్గర్‌ ష్మీడింగ్‌ అంచనా వేశారు. అయితే, సౌదీలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన రాస్‌ తనూరాపై దాడి ద్వారా ఇరాన్‌ ఇప్పటికే ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు గట్టి హెచ్చరిక చేసిందని ప్రముఖ రిస్క్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ వెరిస్క్‌ మేపుల్‌క్రా్‌ఫ్టకు చెందిన ప్రధాన విశ్లేషకుడు టోర్బ్జోర్న్‌ సోల్ట్‌వెడ్ట్‌ గుర్తుచేస్తున్నారు. ఈ దాడి ద్వారా.. గల్ఫ్‌ దేశాల్లోని ఏ చమురు కేంద్రాన్నైనా తాము ధ్వంసం చేయగలమని ఇరాన్‌ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.


గల్ఫ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటే ఆ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపుతాయని ఇరాన్‌ భావిస్తోందని ఆయన విశ్లేషించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని గల్ఫ్‌దేశాలు భరించలేనంత స్థాయికి చేర్చాలన్నదే ఇరాన్‌ ప్లాన్‌ అని.. ఇలాగే మరికొన్ని దాడులు జరిగితే చమురు ధర 90 డాలర్లు అంతకు మించి పెరగొచ్చని ఆయన హెచ్చరించారు. శుద్ధి కేంద్రాలపై ఇరాన్‌ దాడులు.. హోర్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకల నిలిపివేత ఇలాగే మరికొన్నాళ్లు కొనసాగితే.. చమురు ధరలు 100 డాలర్ల మార్కును దాటొచ్చని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు నాలుగువారాలపాటు కొనసాగితే.. 120 డాలర్లకు కూడా వెళ్లొచ్చని జేపీ మోర్గాన్‌ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. కాగా.. ముడిచమురు ధరలు సోమవారం దాదాపు 80 డాలర్లకు చేరినా భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్‌ ధరలు పెరిగినా.. దేశంలో ఇంధన ధరలు పెంచే యోచనేదీ లేదని ప్రభుత్వంలోని విశ్వసనీయవర్గాల సమాచారం. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు వంటి కీలక రాష్ట్రాల శాసనసభలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఆచితూచి వ్యవహరించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - Mar 03 , 2026 | 04:40 AM