కో-పైలట్ సీట్లో విమానం యజమాని నిద్ర!
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:35 AM
తన తండ్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన వీఎస్ఆర్ వెంచర్స్ విమానాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని ఎన్‌సీపీ నేత జయ్ పవార్ ఆరోపించారు.
వీఆర్‌ఎస్ వెంచర్స్ యజమానిని అరెస్టు చేయండి
అజిత్ పవార్ తనయుడు జయ్ పవార్ డిమాండ్
ముంబై, మార్చి 2: తన తండ్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన వీఎస్ఆర్ వెంచర్స్ విమానాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని ఎన్‌సీపీ నేత జయ్ పవార్ ఆరోపించారు. దానికి నిదర్శనమని చూపుతూ సోమవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో వీఎస్ఆర్ వెంచర్స్ యజమాని రోహిత్‌సింగ్ సాధారణ బట్టలు వేసుకొని విమానం ఎడమవైపు పైలట్ సీట్లో కూర్చొని దర్జాగా నిద్ర పోతున్నారు. పక్కనే కుడివైపు పైలట్ సీటులో యూనిఫాం వేసుకొని ఇంకో పైలట్ విమానాన్ని నడుపుతున్నారు. విమానం గగనతలంలో ఉండగా తీసిన ఈ వీడియో ఆ సంస్థ విమానాలను నిర్వహిస్తున్న తీరుకు నిదర్శనమని జయ్ పవార్ చెప్పారు. కాక్‌పిట్‌లో ప్రవేశానికి అనేక కఠిన నిబంధనలు ఉన్నాయని, విమానం యజమానిరోహిత్‌సింగ్ అన్ని నిబంధలను అడ్డంగా ఉల్లంఘించారని ఆరోపించారు. డీజీసీఏ కఠిన చర్యలు తీసుకోవాలని, రోహిత్‌సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ ముగిసే వరకు వీఆర్‌ఎస్ వెంచర్స్ విమానాలను ఎగరకుండా చూడాలని అన్నారు. ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా వీడియోను షేర్ చేస్తూ రోహిత్‌సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోతో స్థానిక పోలీస్ స్టేషన్లో, సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని, ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. రోహిత్‌సింగ్‌కు ఉన్న రాజకీయ సంబంధాల వల్లే అతను అరెస్టు నుంచి తప్పించుకుంటున్నాడని ఆరోపించారు.