IPS Officer Ramachandra Rao: ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:33 AM
కర్ణాటక పోలీసు శాఖలో ఉన్నతాధికారి రాసలీలల వీడియోలు బహిర్గతం కావడంతో దుమారం రేపింది. తన ఆఫీసులోనే, పోలీస్ డ్రెస్సుతో యువతులతో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి సరసాలు ఆడటం పట్ల తీవ్ర విమర్శలు...
కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు బాగోతం బట్టబయలు
సోషల్ మీడియాలో వీడియో వైరల్
జూన్‌లో రిటైర్ కానున్న అధికారి
గతంలోనూ అతనిపై పలు ఆరోపణలు
అవినీతి కేసులు నమోదు
పెంపుడు కుమార్తె రన్యారావ్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్
డీజీపీపై సీఎం సిద్దరామయ్య ఆగ్రహం
మార్ఫింగ్ చేశారంటున్న రామచంద్రరావు
బెంగళూరు, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కర్ణాటక పోలీసు శాఖలో ఉన్నతాధికారి రాసలీలల వీడియోలు బహిర్గతం కావడంతో దుమారం రేపింది. తన ఆఫీసులోనే, పోలీస్ డ్రెస్సుతో యువతులతో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి సరసాలు ఆడటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (డీసీఆర్‌ఈ) డీజీపీ రామచంద్రరావు శృంగార చేష్టల వీడియోలు సోమవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. యూనిఫాంలో ఉన్న ఆయన తన చాంబర్‌లోనే యువతులను కౌగిలించుకుంటూ, ముద్దులు పెట్టే దృశ్యాలు ఆ వీడియోల్లో చూసి అంతా అవాక్కయ్యారు. వివిధ సందర్భాల్లో తీసిన ఆ వీడియోల్లో ఉన్న ముగ్గురు యువతుల్లో ఒకరు మోడల్ అని చెబుతున్నారు. డీజీపీ రాసలీలల వీడియోలపై స్థానిక మీడియా చానళ్లలో ప్రత్యేక కథనాలు హోరెత్తాయి. వీడియోలు వైరల్ అయిన తర్వాత పోలీసుశాఖలో కూడా తీవ్రమైన చర్చసాగుతోంది. పోలీసుల పరువు పోయిందని పలువురు మండిపడుతున్నారు. రామచంద్రరావు చేష్టలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రామచంద్రరావు నుంచి వివరణ తీసుకుని చర్యలు తీసుకోవాలని హోం శాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఆ వీడియోలు మార్ఫింగ్ చేసినవని రామచంద్రరావు చెబుతున్నారు.
ఏపీలోని గుంటూరుకు చెందిన రామచంద్రరావు 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2023లో ఆయన డీజీపీగా పదోన్నతి పొం దారు. వచ్చే జూన్‌లో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఆయన పదవీకాలంలో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన పెంపుడు కూతురు, సినీనటి రన్యారావ్ దుబాయ్ నుంచి పలుమార్లు బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చిన విషయం గతంలో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎయిర్‌పోర్టు నుంచి రన్యారావ్ ఎలాంటి చెకింగ్ లేకుండా ప్రొటోకాల్ ద్వారా బయటకు వచ్చేందుకు పోలీసు వాహనాన్ని వినియోగించారు. ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో డీజీపీపై అప్పట్లో సస్పెన్షన్ వేటు పడింది. గత ఏడాది చివర్లో మరోసారి రామచంద్రరావుకు పోస్టింగ్ ఇచ్చారు. పోలీస్ హౌసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సీఎండీగా పనిచేసిన సమయంలోనూ ఆయన కేసులు, అంతర్గత విచారణలు ఎదుర్కొన్నారు. దక్షిణ రేంజ్ ఐజీపీగా ఉన్నప్పుడు ఓ కేసులో పట్టుబడ్డ డబ్బులో పెద్ద మొత్తం మాయం చేశారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. కాగా హోం మంత్రి పరమేశ్వర్‌ను కలిసి వివరణ ఇచ్చేందుకు సోమవారం సాయంత్రం రామచంద్రరావు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైరల్ అయిన వీడియోలు మార్ఫింగ్ చేసినవన్నారు. ఇది తన పరువుకు భంగం కలిగించేందుకు చేసిన కుట్ర అని ఆరోపించారు. ఆ వీడియోలు 8 క్రితం నాటివని, ఆ సమయంలో తాను బెళగావిలో ఉన్నానన్నారు.