Controversial Slogans Against Modi and Shah: మోదీ, షాలకు సమాధులు తవ్వుతాం!
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:24 AM
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో కొందరు విద్యార్థులు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా ...
జేఎన్‌యూలో కొందరు విద్యార్థుల నినాదాలు
న్యూఢిల్లీ, జనవరి 6: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో కొందరు విద్యార్థులు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా అభ్యంతరకర నినాదాలు చేశారు. 2020లో ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిలు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రాత్రి వర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంతో పాటు మోదీ, షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మోదీ, అమిత్ షాలకు సమాధులు తవ్వుతాం’ అంటూ తీవ్ర వివాదాస్పద నినాదాలు చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, 2020లో వర్సిటీలో జరిగిన హింసకు వ్యతిరేకంగా ఏటా జనవరి 5న నిరసన కార్యక్రమం చేపడతారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అదితి మిశ్రా చెప్పారు. అక్కడ చేసిన నినాదాలు సైద్ధాంతికపరమైనవే తప్ప ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా చేసినవి కాదని పేర్కొన్నారు. కాగా, ప్రధాని, హోంమంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిపై కేసు నమోదు చేయాలంటూ వర్సిటీ భద్రతాధికారులు ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. ఆ నినాదాలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయన్నారు. జేఎన్‌యూఎ్‌సయూ అధ్యక్షురాలు అదితి మిశ్రా సహా పలువురి పేర్లను లేఖలో ప్రస్తావించారు. వివాదాస్పద నినాదాలు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని యూనివర్సిటీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. యూనివర్సిటీలు సరికొత్త ఆలోచనలు, నవకల్పనలకు కేంద్రాలుగా ఉండాలి తప్ప విద్వేషాలకు ప్రయోగశాలలుగా మారకూడదని తేల్చిచెప్పింది. బాధ్యులపై తక్షణ సస్పెన్షన్, బహిష్కరణ, శాశ్వతంగా డిబార్ చేయడం వంటి క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపింది. జేఎన్‌యూలో వివాదాస్పద నినాదాలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఖండించారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నవారికి జేఎన్‌యూను అడ్డాగా మార్చేశారని విపక్షాలపై మండిపడ్డారు.