Share News

Indore City: స్వచ్ఛ నగరం ఇండోర్‌లో కలుషిత జలాలు తాగి 8 మంది మృతి

ABN , Publish Date - Jan 01 , 2026 | 06:36 AM

దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పైపులైన్లు లీకయి మురుగు నీరు తాగునీటిలో కలిసిపోవడంతో 8 మంది మృతి చెందారు.

Indore City: స్వచ్ఛ నగరం ఇండోర్‌లో కలుషిత జలాలు తాగి 8 మంది మృతి

  • వందలాది మంది ఆస్పత్రుల పాలు

  • పైప్‌లైన్లు లీకై తాగునీటిలోకి మురుగునీరు

ఇండోర్‌, డిసెంబరు 31 : దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పైపులైన్లు లీకయి మురుగు నీరు తాగునీటిలో కలిసిపోవడంతో 8 మంది మృతి చెందారు. మరో 149 మంది నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని నగర మేయర్‌ పుష్యమిత్ర భార్గవ తెలిపారు. ఇండోర్‌లోని భగీరథ్‌పుర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కలుషిత జలాల కారణంగా కొద్ది రోజులుగా ఇక్కడ 1,100మందికి పైగా అస్వస్థత పాలవగా వారిలో బుధవారానికి 8 మంది మృతి చెందారు. ఆ రాష్ట్ర సీఎం మోహన్‌ యాదవ్‌ ఈ దుర్ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇండోర్‌లోని ఇద్దరు మున్సిపల్‌ అధికారులను సస్పెండ్‌ చేయాలని, ఒక పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీర్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని మంగళవారం రాత్రి ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. బాధితులందరి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల చేత విచారణకు ఆదేశించారు. ఈ నెల 25నే మున్సిపల్‌ కుళాయిల నుంచి వచ్చే తాగునీరు దుర్వాసన వస్తున్నాయని భగీరథ్‌పుర వాసులు గుర్తించారు. ఆ రోజు నుంచి ఆ నీటిని తాగిన పలు కుటుంబాలవారు అస్వస్థత పాలయ్యారు. మురుగునీరు తాగునీటిలో కలిసినట్లయితే ప్రజలు వాంతులు, డయేరియా, కామెర్లతో ఇబ్బంది పడతారు తప్ప చనిపోరని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జితు పట్వారీ పేర్కొన్నారు. తాగునీటి పైపులైన్లలో ఏదో విష పదార్థం కలిసిపోయినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఇండోర్‌ వరుసగా 8 ఏళ్లపాటు దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా అవార్డులు అందుకుంది. ఇంటింటి చెత్త సేకరణతోపాటు ఆసియాలోనే అతి పెద్ద బయో సీఎన్‌జీ ప్లాంటు ఏర్పాటుతో ఆదర్శ నగరంగా గుర్తింపు పొందింది.

Updated Date - Jan 01 , 2026 | 06:37 AM