Share News

నాగపూర్‌లో బీజేపీకి ఝలక్‌

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:52 AM

శాసనమండలి ఎన్నికల్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించి స్వీప్‌ చేశామన్న సంబరాల్లో ఉన్న బీజేపీకి.. మహారాష్ట్రలో షాక్‌ తగిలింది.

నాగపూర్‌లో బీజేపీకి ఝలక్‌

  • ఆర్‌ఎస్ఎస్‌ ఇలాకాలో కాంగ్రెస్‌ గెలుపు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కైవసం

  • మహారాష్ట్రలో కాంగ్రెస్‌ కూటమి పైచేయి

  • 5 స్థానాలకుగాను మూడు చోట్ల గెలుపు

  • రెండు సీట్లతో సరిపెట్టుకున్న ఎన్‌డీఏ

  • ముగిసిన 4 రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఎన్‌డీఏదే పైచేయి

  • 28 స్థానాలకు గాను 16 చోట్ల గెలుపు

ముంబై/న్యూఢిల్లీ, అక్టోబరు 29: శాసనమండలి ఎన్నికల్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించి స్వీప్‌ చేశామన్న సంబరాల్లో ఉన్న బీజేపీకి.. మహారాష్ట్రలో షాక్‌ తగిలింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇలాకా, ఆర్‌ఎ్‌సఎస్‌ హెడ్‌క్వార్టర్స్‌ అయిన నాగపూర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ ఓటమిపాలైంది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి అభిజీత్‌ వంజరి 3,271 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ కోహలేపై గెలుపొందారు. మంగళవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 40 గంటలపాటు కొనసాగగా.. గురువారం తెల్లవారుజామున ఫలితాన్ని ప్రకటించారు. కాగా, ఈ స్థానం నుంచి గతంలో నితిన్‌ గడ్కరీ ఏకంగా 24 ఏళ్లపాటు శాసనమండలి సభ్యుడిగా కొనసాగారు. 1994 నుంచి 2014 వరకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. తాజా ఓటమితో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బతగిలినట్లయింది. మొత్తంగా మహారాష్ట్రలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్‌ కూటమి మహావికాస్‌ అఘాడీ మూడింటిని గెలుచుకుంది. అధికార ఎన్‌డీఏకు రెండు స్థానాలు దక్కాయి. కాగా, బుధవారం ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ముఖ్యమంత్రి ఫడణవీస్‌ ‘ఎక్స్‌’లో చేసిన ట్వీట్లను గురువారం డిలీట్‌ చేశారు. దీనిపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఫడణవీస్‌ మరోసారి సావర్కర్‌ వారసత్వాన్ని కొనసాగించారని ఎద్దేవా చేసింది. ఇది ట్రైలర్‌ మాత్రమేనని, 2029లో మహారాష్ట్ర ప్రజలు అసలు సినిమా చూపిస్తారని ‘ఎక్స్‌’లో పేర్కొంది.


మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణసీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని సమాజ్‌వాది పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 16 స్థానాల్లో గెలుపొందినా.. నాగపూర్‌, వారాణసీ ఫలితాలు బీజేపీకి ఇబ్బందికర పరిస్థితిని సృష్టించినట్లయింది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకుగాను 6 చోట్ల బీజేపీ, 5 చోట్ల సమాజ్‌వాది పార్టీ గెలుపొందాయి. ఇక బిహార్‌లో ఎనిమిది చోట్ల ఎన్నికలు జరగగా.. బీజేపీ మూడు స్థానాలను, జేడీయూ, ఆర్జేడీ, జన్‌సురాజ్‌ పార్టీ ఒక్కొక్కటి చొప్పున గెలుచుకున్నాయి. రెండు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. కాగా, మహారాష్ట్రలో ఆరు స్థానాలకుగాను ఎన్‌సీపీ(ఎస్పీ)-2, బీజేపీ-1, కాంగ్రెస్‌-1, శివసేన-1 చొప్పున నెగ్గాయి. ఇక కర్ణాటకలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకుగాను మూడు చోట్ల బీజేపీ, ఒక స్థానంలో జేడీఎస్‌ గెలుపొందాయి.

Updated Date - Oct 30 , 2026 | 02:56 AM