కాంగ్రెస్ అడిగింది 130.. ఎస్‌పీ ఇస్తామన్నది 26
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:12 AM
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చర్చలు మంగళవారం ఢిల్లీలో వరుసగా రెండోరోజు కూడా కొనసాగాయి.
యూపీలో సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో రెండో రోజూ ఇరు పార్టీల చర్చలు
చర్చల ఫలితాలపై అప్పుడే మాట్లాడటం బాగుండదన్న అఖిలేశ్
అయిదుగురి పేర్లతో తొలి జాబితా విడుదల చేసిన సమాజ్‌వాదీ పార్టీ
న్యూఢిల్లీ, నవంబరు 24: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చర్చలు మంగళవారం ఢిల్లీలో వరుసగా రెండోరోజు కూడా కొనసాగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ నివాసంలో సోమవారం జరిగిన సమావేశం కేవలం 20 నిమిషాలు జరిగింది. ఆ సందర్భంగా తాము పోటీచేయదలచిన 130 సీట్ల జాబితాను కాంగ్రెస్ నేతలు ఎస్‌పీ బృందానికి అందజేశారు. మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ బృందం 26 సీట్లు ఇస్తామని వారికి ప్రతిపాదించడం గమనార్హం. 2022లో కాంగ్రెస్ గెలిచిన రెండు సీట్లు.. రెండో స్థానంలో నిలిచిన నాలుగు సీట్లు, ఎస్‌పీ 60-70 వేల ఓట్లు సాధించిన 20 స్థానాలు.. ఇస్తామని చెప్పామని ఎస్‌పీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ తెలిపారు. ఈ 20 సీట్లలో కాంగ్రెస్‌కు 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. ప్రతి సీటుపైనా చర్చలు జరిపామని.. 403సీట్ల పై చర్చలకు సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి 403మంది సభ్యుల అసెంబ్లీలో ఏకంగా 181సీట్లు కోరుతూ కాంగ్రెస్ జాబితా సమర్పించినట్లు సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ కొద్దిరోజుల కిందట చెప్పిన సంగతి తెలిసిందే.
సోమవారంనాటి చర్చల్లో 181ని కాంగ్రెస్ 130కి కుదించింది. ఇప్పుడేమో ఎస్‌పీ 26 సీట్లే ఇవ్వజూపుతోంది. దీనిని కాంగ్రెస్ ఎంతవరకు అంగీకరిస్తుందో చూడాలి. మరో రెండు సమావేశాల్లో సర్దుబాటు కొలిక్కి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌కు 26 సీట్లే ఇవ్వజూపడంపై అఖిలేశ్ లఖ్‌నవూలో స్పందించారు. గెలుపే ప్రధాన లక్ష్యమన్నారు. చర్చల ఫలితాలపై అప్పుడే మాట్లాడడం బాగుండదని.. వివిధ నియోజకవర్గాల్లో మిత్రపక్షాల అభ్యర్థుల విజయావకాశాలపై సీనియర్ నేతలు చర్చిస్తున్నారని తెలిపారు. తమ కూటమి ప్రధాన ధ్యేయం రాజకీయ ప్రత్యర్థి బీజేపీని ఓడించడమేనని... ఎన్నికల్లో విజయానికి మిత్రపక్షాలు కలిసికట్టుగా నడవాలని.. సర్దుబాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. పెద్దపోరాటమే తమ ముందుందని.. ఎన్నికల సవాల్‌ను దృష్టిలో ఉంచుకుని భాగస్వామ్య పక్షాలకు అవకాశం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చలు ముగిసిన అనంతరం రాత్రి అయిదుగురి పేర్లతో ఎస్పీ తొలి జాబి తా విడుదల చేసింది. శాహరాన్‌పూర్ జిల్లా బెహత్ సెగ్మెంట్ నుంచి ఉమర్ ఆలీ ఖాన్, శహరాన్‌పూర్ నుం చి ఆశు మాలిక్, శామ్లీ జిల్లా కైరానా నుంచి నిషాద్ హసన్, అమరోహా నుంచి మహబూబ్ ఆలీ, లలిత్‌పూర్ నుంచి జ్యోతి లోఢీ పోటీ చేస్తారని ప్రకటించింది.