థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో దుమారం!
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:44 AM
జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీలో దుమారం రేగింది.
కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి నెలకొంటోందన్న కాంగ్రెస్ సీనియర్ నేత.. మండిపడ్డ సొంత పార్టీ నేతలు
న్యూఢిల్లీ, జూన్ 21: జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీలో దుమారం రేగింది. థరూర్ పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారంటూ కాంగ్రెస్ నేతలే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన థరూర్.. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయ్యారు. అనంతరం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘శ్రీనగర్‌లో ఎల్జీ మనోజ్ సిన్హాతో అద్భుత సమావేశం జరిగింది. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంలో ప్రోత్సాహకరమైన పురోగతిపై చర్చించాం. నేను చేరుకునే సరికి ఆయన కశ్మీరీ రచయితల సంఘం, మహిళా సంఘాల నేతలతో మాట్లాడుతున్నారు. ఈ సానుకూల ధోరణిని స్వాగతిస్తున్నా.. ఇంకా ఎన్నో సవాళ్లున్నాయి. చేయాల్సిందీ చాలానే ఉంది. కానీ కొంతకాలం తర్వాత సానుకూల భావనతో సమావేశం నుంచి వెనుదిరిగా..’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే థరూర్ తీరుపై జమ్మూ కశ్మీర్‌లోని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవీందర్ శర్మ విరుచుకుపడ్డారు. థరూర్ క్షేత్రస్థాయి వాస్తవాలను అర్థం చేసుకోవడానికి కశ్మీర్ లోయ ప్రజల్ని కలిసి మాట్లాడితే బాగుండేదని పేర్కొన్నారు. మరోవైపు థరూర్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి అభిజీత్ జస్రోటియా సమర్థించారు. ‘ఇందులో ఆశ్చర్యం ఏముంది. కాంగ్రెస్ ఎన్ని ఆరోపణలు చేస్తున్నా.. క్షేత్రస్థాయి గణాంకాలు మరోలా ఉన్నాయి. గత 18 నెలల్లో ఒక్క యువకుడు కూడా ఉగ్రవాదుల్లో చేరలేదు’ అని పేర్కొన్నారు.