కాంగ్రెస్‌లో కీలక మార్పులు!
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:56 AM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో కీలక మార్పులు చేపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ప్రియాంక
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో కీలక మార్పులు చేపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏఐసీసీలో కార్యదర్శులుగా నియమించేందుకు రాహుల్ పలువురు నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్‌గా ప్రియాంకా వాధ్రాను నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికల తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పదవీ విరమణ చేస్తారని సమాచారం. ఆయన స్థానంలో సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను అధ్యక్షుడిగా నియమించవచ్చునని భావిస్తున్నారు. తెలంగాణ ఇన్‌చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ స్టడీ టూర్‌కు విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నందువల్ల ఆమె స్థానంలో మరొకరిని నియమించే అవకాశాలున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శులను, వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జులను త్వరలో నియమిస్తారని, అదే సమయంలో ప్రస్తుత ఇన్‌చార్జులను పలువురిని తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్టోబరు ఆఖరుకు వివిధ రాష్ట్రాల్లో జిల్లాల అఽధ్యక్షుల నియామకం పూర్తవుతుందని కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ప్రకటించారు.