కాంగ్రెస్ ‘చలో ఢిల్లీ’ వాయిదా
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:18 AM
ఓట్ చోరీ అంశంపై ఈ నెల 25, 26 తేదీల్లో చేపట్టదలచిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకుంది. 26న రాజ్యాంగ దినోత్సవం ఉన్నందున తమ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు..
26న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ : ఏఐసీసీ
న్యూఢిల్లీ, నవంబరు 15: ఓట్ చోరీ అంశంపై ఈ నెల 25, 26 తేదీల్లో చేపట్టదలచిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకుంది. 26న రాజ్యాంగ దినోత్సవం ఉన్నందున తమ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు, ఆ రోజు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు తొలగించిన ఓట్లపై బూత్ స్థాయి తనిఖీలు, గ్రామ స్థాయిలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ పేరిట గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు, ఇన్‌చార్జులకు సర్క్యులర్ జారీ చేశారు. ఓట్ చోరీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రోజువారీగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలంటూ సర్క్యులర్‌లో ఆదేశించారు. ఈ నెల 22 దాకా డీసీసీల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఓట్ రక్షక్‌లను నియమించాలని, క్షేత్రస్థాయి క్యాడర్‌కు దీనిపై శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం ఈ నెల 22 నుంచి 30 వరకు ఓట్ రక్షక్‌ల ద్వారా బూత్‌లను సందర్శించి తొలగించిన ఓట్లను పరిశీలించాలని, దానిని మండల పార్టీ అధ్యక్షులు పర్యవేక్షించాలని సూచించారు. ఇక ఈ నెల 29 నుంచి డిసెంబరు 15 వరకు గ్రామ స్థాయిలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ పేరిట గ్రామసభలు నిర్వహించాలన్నారు.