మహిళా బిల్లు ముసుగులో బుల్డోజ్ చేసే యత్నం
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:52 AM
మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొచ్చేందుకు మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది...
ప్రజాస్వామ్యానికి విఘాతం: కాంగ్రెస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొచ్చేందుకు మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో తీవ్రమైన లోపాలున్న, రాజ్యాంగ విరుద్ధమైన, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన పునర్విభజన బిల్లును తెస్తూ బుల్డోజ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. రెండు పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం నియంతృత్వ పాలకుల కుటిల వైఖరికి అద్దం పడుతోందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. కాగా, మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్‌ను కలుపుతూ తీసుకొస్తున్న బిల్లు భారత సమాఖ్య వ్యవస్థకు డెత్ వారెంట్ లాంటిదని సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ను మూడు ముక్కలు చేసేందుకే మోదీ సర్కారు డీలిమిటేషన్ బిల్లును తెస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆరోపించారు.