ఓట్ చోరీపై గర్జన నేడే
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:40 AM
ఓట్ చోరీ అంశంపై ఛలో ఢిల్లీ పేరిట కాంగ్రెస్ నిర్వహిస్తున్న మెగా ర్యాలీతో ఆదివారం దేశ రాజధాని స్తంభించనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ పార్టీ కార్యకర్తలను..
ఢిల్లీలో 10 లక్షల మందితో మెగా ర్యాలీకి సిద్ధమైన విపక్షాలు
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ర్యాలీకి అనుమతి.. కాక్రోచ్ పార్టీ, వామపక్షాల మద్దతు
అడుగడుగునా పహారా, సీసీ టీవీలతో నిఘా.. ర్యాలీకి రాష్ట్రం నుంచి 4500, ఏపీ నుంచి వెయ్యి మంది
న్యూఢిల్లీ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఓట్ చోరీ అంశంపై ఛలో ఢిల్లీ పేరిట కాంగ్రెస్ నిర్వహిస్తున్న మెగా ర్యాలీతో ఆదివారం దేశ రాజధాని స్తంభించనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ పార్టీ కార్యకర్తలను, నేతలను రప్పించడంతో వివిధ రాష్ట్రాల భవన్లు, హోటళ్లు, అతిథి గృహాలు కిక్కిరిసిపోయాయి. ఢిల్లీ వీధుల్లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పోస్టర్లు, కార్యకర్తల హడావుడి కనిపిస్తోంది. మెగా ర్యాలీకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు కూడా ర్యాలీకి మద్దతు ఇవ్వడంతో భారీ ఎత్తున జనం ధర్నాలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నాట్ ప్లేస్ కూడలిలోని మింటో రోడ్ నుంచి రాంలీలా మైదాన్ వరకు మధ్యాహ్నం 12 గంటలకు ఇండి కూటమి నిర్వహించనున్న ఊరేగింపులోను, ఆ తర్వాత మైదాన్ లోనూ కనీవినీ ఎరుగని రీతిలో జనం పాల్గొనేందుకు కూటమి పార్టీలు సన్నాహాలు చేశాయి. ర్యాలీని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు, పారా మిలటరీ దళాలను దించారు. అడుగడుగునా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దేశంలో కాంగ్రెస్ జవజీవాలు కోల్పోలేదని నిరూపించేందుకు ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించనుంది. లక్షలాదిమందితో ఢిల్లీని ముంచెత్తనుంది. రెండు రోజుల నుంచే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రతినిధులతోపాటు గ్రామాల స్థాయి నుంచీ పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. రైల్వే సహకరించకపోయినా ప్రతి రాష్ట్రం నుంచీ బస్సులను ఏర్పాట్లు చేశారు.
ఒక్క తెలంగాణ నుంచే 80 బస్సులు ఏర్పాటు చేశారని, అక్కడి నుంచి వివిధ మార్గాల్లో 4,500 మంది చేరుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ నుంచి వెయ్యి మంది వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకే తెలంగాణ భవన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బస్సుల్లో మింటో రోడ్‌కు వెళ్లాలని నిర్ణయించారు. ఇక, ఢిల్లీ నుంచే లక్షమంది వస్తారని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు తెలిపారు. ఈ నేపథ్యంలోనే, ఆదివారంనాటి ర్యాలీ బల ప్రదర్శనగా మారింది. ర్యాలీ తర్వాత ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఉధృత ప్రచారం ఉంటుందని, పాదయాత్రలు, ఊరేగింపులు జరుగుతాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు.
రాహుల్ గాంధీ చుట్టూ 2 వేల మంది
మింటో రోడ్ నుంచి ఊరేగింపుగా వెళ్లే రాహుల్ గాంధీ చుట్టూ 2 వేలమంది పార్టీ కార్యకర్తలు నలుపు రంగు ప్రత్యేక డ్రెస్ ధరించి భద్రతగా ఉండనున్నారు. ఎంపీలు కానిస్టిట్యూషన్ క్లబ్ నుంచి; ముఖ్యమంత్రులు, సీడబ్ల్యూసీ సభ్యులు, పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఇంటి నుంచి, ఇతర వీఐపీలు ఆయా రాష్ట్రాల భవన్‌ల నుంచి బయలు దేరేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. హరియాణా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, ఉత్తరాఖండ్ వంటి సమీప రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తారని, పది లక్షల మంది రాజధానిని ముంచెత్తడమే లక్ష్యంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా చెప్పారు.