Share News

Maoists: మావోల హిట్‌లిస్ట్లో కాంగ్రెస్‌ నేత!

ABN , Publish Date - Jan 03 , 2026 | 02:57 AM

మావోయిస్టు పార్టీ అగ్రనేత మాద్వి హిడ్మా మృతికి కారణమైన కుట్రదారులెవరో తమకు తెలిసిపోయిందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Maoists: మావోల హిట్‌లిస్ట్లో కాంగ్రెస్‌ నేత!

  • హిడ్మా మృతికి కారకులైన వారిని వదిలిపెట్టబోమని మావోయిస్టుల లేఖ

చర్ల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ అగ్రనేత మాద్వి హిడ్మా మృతికి కారణమైన కుట్రదారులెవరో తమకు తెలిసిపోయిందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అల్లూరి సీతారామరాజు డివిజన్‌ కమిటీ ‘విప్లవ’ పేరుతో శుక్రవారం లేఖ విడుదల చేసింది. హిడ్మా, రాజితో పాటు మరికొంత మంది సభ్యులను వైద్యం చేయిస్తానని నమ్మించి సదరు కాంట్రాక్టర్‌ తమను ఎలా మోసం చేశాడో చెప్పడానికి అవసరమైన వాయిస్‌ రికార్డులు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. కొండవాయి మార్గంలో కారు ఉంచి మావోయిస్టులను తరలించడంలో భద్రాద్రి జిల్లా చర్లకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నాయకుడు ఒకరు కీలకపాత్ర పోషించినట్లు గుర్తించామని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. గతంలో ఇదే నాయకుడికి క్షమాభిక్ష పెట్టామన్నారు. వైద్యం పేరుతో ఆంధ్రా తీసుకెళ్లి శత్రువులకు చిక్కేలా చేసిన వారిని వదిలి పెట్టబోమని హెచ్చరించారు. ఇటీవలే పార్టీని మోసం చేసిన ఓ కాంట్రాక్టర్‌ను అంతమొందించామని గుర్తు చేశారు. తమ నిఘాలో మరికొంత మంది కాంట్రాక్టర్లు ఉన్నారన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 02:57 AM