Share News

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుల పనితీరు మదింపునకు కలర్‌ కోడ్‌ వ్యవస్థ

ABN , Publish Date - May 09 , 2026 | 05:00 AM

కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. దిగువ స్థాయి నుంచి నాయకుల పనితీరును నిరంతరాయంగా మదింపు చేయడానికి నూతన వ్యవస్థ..

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుల పనితీరు మదింపునకు కలర్‌ కోడ్‌ వ్యవస్థ

న్యూఢిల్లీ, మే 8: కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. దిగువ స్థాయి నుంచి నాయకుల పనితీరును నిరంతరాయంగా మదింపు చేయడానికి నూతన వ్యవస్థ... ‘కలర్‌ కోడ్‌’ను రూపొందించింది. ఇది నేరుగా కాంగ్రెస్‌ సెంట్రల్‌ వార్‌ రూమ్‌ చైర్మన్‌ శశికాంత్‌ సెంథిల్‌కు ప్రత్యేక ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ద్వారా అందుబాటులో ఉంటుంది. సంస్థాగత పునర్నిర్మాణ ఉద్యమం (సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌) కార్యక్రమం కింద కాంగ్రెస్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా జిల్లా పార్టీ అధ్యక్షులను నియమించింది. వారు ప్రతి నెలా తాము చేసిన పనిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. బాగా చేసిన వారికి ఆకుపచ్చ రంగు, ఒక మాదిరి పనితీరు కనబరిచిన వారికి ముదురు పసుపు రంగు, సక్రమంగా పనిచేయని వారికి ఎరుపు రంగు కేటాయిస్తారు. మొదటి 3నెలల తరువాత పనితీరు మదింపు జరుగుతుంది. ఎరుపు రంగు వచ్చిన వారికి పనితీరును మెరుగుపరుచుకోవాలన్న సూచనలు చేస్తూ మరో 3నెలలు గడువు ఇస్తారు. ఆ తరువాత కూడా పనితీరు మెరుగుపడకపోతే లోపాలను గుర్తించడానికి లోతైన విశ్లేషణతో పాటు వారిని మార్చడానికి ఉన్న అవకాశాలనూ పరిశీలిస్తారు.

Updated Date - May 09 , 2026 | 05:00 AM