Share News

ఢిల్లీకి రండి..

ABN , Publish Date - May 26 , 2026 | 04:12 AM

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రతినిధి కేసీ వేణుగోపాల్‌...

ఢిల్లీకి రండి..

  • సిద్దూ, డీకేకి పిలుపు

బెంగళూరు, మే 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రతినిధి కేసీ వేణుగోపాల్‌ వారిద్దరినీ ఢిల్లీకి రావాలని సూచించారు. సిద్దరామయ్యకు ఆదివారం సాయంత్రం కేసీ వేణుగోపాల్‌ ఫోన్‌ చేసి ఢిల్లీకి రావాలని సూచించారు. డీకే శివకుమార్‌కు సోమవారం మధ్యాహ్నం ఆయన నుంచి పిలుపు వచ్చింది. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు, మంత్రి ప్రియాంక్‌ ఖర్గేని కూడా ఆహ్వానించారని సమాచారం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఢిల్లీ నుంచి పిలుపు ఎందుకు వచ్చిందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై 6నెలలుగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. అధిష్ఠానం కొనసాగమంటే మరో రెండేళ్లు పదవిలో ఉంటానని సీఎం సిద్దరామయ్య పలుమార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నాయకత్వ మార్పు అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, రాహుల్‌గాంధీ లేకుండా సమావేశం జరుగుతుందని అంటున్నారు. కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ చేయాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో 4స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అధికార కాంగ్రెస్‌ 3 స్థానాలను గెలుచుకునే వీలుంది. ఖర్గేకు ఓ సీటు ఖరారు చేశారు. మిగిలిన వాటిలో కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు అవకాశం ఉంటుందని చర్చ నడుస్తోంది.

Updated Date - May 26 , 2026 | 04:12 AM