Congress Faces Crisis in Bihar: బిహార్లో కాంగ్రెస్ ఖాళీ!
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:37 AM
బిహార్ రాజకీయ యవనికపై కాంగ్రెస్ అంతర్థానం కానుందా? ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆ రాష్ట్రంలో దాని ఉనికే ప్రశ్నార్థకమవుతోందా? తాజా రాజకీయ పరిణామాలు దీనినే సూచిస్తున్నాయి.
మొన్న గెలిచిన ఎమ్మెల్యేలూ జంప్?
పట్నా, జనవరి 16: బిహార్ రాజకీయ యవనికపై కాంగ్రెస్ అంతర్థానం కానుందా? ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆ రాష్ట్రంలో దాని ఉనికే ప్రశ్నార్థకమవుతోందా? తాజా రాజకీయ పరిణామాలు దీనినే సూచిస్తున్నాయి. 243 స్థానాల అసెంబ్లీకి గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆర్‌జేడీతో పొత్తుతో 61 చోట్ల పోటీచేసిన కాంగ్రెస్.. అతి కష్టమ్మీద ఆరు స్థానాలే గెలిచింది. ఇప్పుడా ఆరుగురు ఎమ్మెల్యేలు..సురేంద్రప్రసాద్ కుశ్వాహా (వాల్మీకినగర్), అభిషేక్ రంజన్ (చంపాతియా), మనోజ్ బిశ్వాస్ (ఫోర్బ్స్‌గంజ్), అవిదుర్ రహ్మాన్ (అరారియా), కమ్రూల్ హోదా (కిషన్‌గంజ్), మనోహర్‌ప్రసాద్ సింగ్ (మణిహారి) పార్టీ ఫిరాయిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. పాలక ఎన్‌డీఏ భాగస్వామి, సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరేందుకు వారు ఆ పార్టీ నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత కొంత కాలంగా వీరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీబీ-జీరామ్‌జీ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తలపెట్టిన దేశవ్యాప్త ఆందోళనకూ డుమ్మాకొట్టారు. పార్టీపై వారిలో అసంతృప్తి పతాకస్థాయికి చేరిందని.. తమ నాయకత్వంతో గుట్టుగా మంతనాలు జరుపుతున్నారని జేడీయూ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అయితే ఆయన వ్యాఖ్యలను సీఎల్పీ మాజీ చైర్మన్ షకీల్ అహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఆందోళన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎన్‌డీఏ ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తోందని ఏఐసీసీ బిహార్ కార్యదర్శి షానవాజ్ ఆలం ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలు గనుక జేడీయూలోకి ఫిరాయిస్తే.. స్వాతంత్ర్యానికి ముందు గానీ.. తర్వాత గానీ తొలిసారి రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రె్‌సకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది.