ఆ బిల్లులపై ఏం చేద్దాం?
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:49 AM
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శుక్రవారం సమావేశం కానుంది. కేంద్రం అగమేఘాల మీద తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు...
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
మహిళా, పునర్విభజన బిల్లులపై చర్చ
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఏప్రిల్ 9: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శుక్రవారం సమావేశం కానుంది. కేంద్రం అగమేఘాల మీద తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతోపాటు పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితులపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభమవుతుందని తెలిపాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు గత వారం ముగిసినా.. నిరవధికంగా వాయిదా పడలేదు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఉభయసభలు మళ్లీ సమావేశం కానున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశ రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొచ్చే ఈ బిల్లుల విషయంలో ఇంత తొందర ఎందుకని కాంగ్రెస్ తొలి నుంచీ ప్రశ్నిస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు వ్యవహారం అత్యంత సున్నితమైన అంశమని.. సమగ్ర సమీక్ష అనంతరం రాజ్యాంగ సవరణతో తీసుకోవాల్సిన ఈ నిర్ణయాలను ఆకస్మికంగా తీసుకుంటే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడు, కేరళం తదితర రాష్ట్రాలకు నష్టం చేకూరే ప్రమాదం ఉందని కేంద్రాన్ని హెచ్చరించింది. పుదుచ్చేరితోపాటు నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల అనంతరం మే నెలలో వీటిపై చర్చిద్దామని ప్రతిపాదించినా కూడా కేంద్రం ఇప్పటికిప్పుడే ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి (ఎన్‌డీఏకు) లబ్ధి కలిగించటానికే వీటిని తెరపైకి తెచ్చారని, ఇది కోడ్ ఉల్లంఘన అని విమర్శించింది. కాగా, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై లోక్‌సభ సెక్రటేరియట్ మెమోరాండం జారీ చేసింది.
పశ్చిమాసియా పరిణామాలపైనా చర్చ
పశ్చిమాసియా పరిణామాల మీద కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియా సంక్షోభానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించింది. కాల్పుల విరమణ, సంధి కోసం జరిగిన ప్రయత్నాల్లో ప్రధాని మోదీ ఎందుకు చొరవ చూపలేదని నిలదీసింది. మధ్యవర్తి పాత్రను పాకిస్థాన్ పోషించి ఇరుపక్షాలను కాల్పుల విరమణకు ఒప్పించటం.. మోదీ ‘వ్యక్తిగత దౌత్యానికి’ తీవ్ర విఘాతమని అభివర్ణించింది. దీనికి కొనసాగింపుగానే.. వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ తీరుపై మరింత నిశితమైన విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.