కాన్ఫిడెంట్ రియల్ ఎస్టేట్స్ ఫౌండర్ సీజే రాయ్ ఆత్మహత్య
ABN , Publish Date - Jan 31 , 2026 | 03:45 AM
కేరళకు చెందిన కాన్ఫిడెంట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఫౌండర్ చైర్మన్ సీజే రాయ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఐటీ దాడుల భయంతో తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం
బెంగళూరు, జనవరి 30(ఆంధ్రజ్యోతి): కేరళకు చెందిన కాన్ఫిడెంట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఫౌండర్ చైర్మన్ సీజే రాయ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులోని కాన్ఫిడెంట్ గ్రూప్‌పై ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడులకు భయపడి సీజే రాయ్, తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరు రిచ్‌మండ్ సర్కిల్‌లో ఉన్న ల్యాంగ్‌ఫర్డ్ రోడ్డులో ఈ సంఘటన జరిగింది. సీజే రాయ్‌పై పన్నులు ఎగవేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఐటీశాఖ అధికారులు ఆ కంపెనీపై దాడులు చేశారు. సుమారు గంటకుపైగానే సీజే రాయ్‌ను విచారించారు. ఆ తర్వాత కాసేపటికే ఆయన తుపాకీతో కాల్చుకున్నారు. కంపెనీ సిబ్బంది హుటాహుటిన హెచ్‌ఎ్‌సఆర్ లే అవుట్‌లోని నారాయణ ఆసుపత్రి తరలించినా, అప్పటికే ఆయన చనిపోయారు. 2025 ఫోర్బ్స్ ప్రకటించిన వందమంది అత్యంత ధనిక వ్యాపారవేత్తలలో రాయ్ ఒకరు. దుబాయ్ సహా పలు దేశాల్లో ఆస్తులున్నాయి. వీటి విలువ బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.