Central Government: కేంద్ర ఉద్యోగులకు సమగ్ర వేతన ప్యాకేజీ ఖాతా!
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:07 AM
కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు సమగ్ర వేతన ప్యాకేజీ ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బ్యాంకింగ్, బీమా, కార్డుల సేవలన్నీ ఈ అకౌంట్‌తోనే..
న్యూఢిల్లీ, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు సమగ్ర వేతన ప్యాకేజీ ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్థిక సేవల విభాగం బుధవారం ఈ ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే ఖాతా ద్వారా బ్యాంకింగ్, బీమా, కార్డుల సేవలు సమగ్రంగా అందుతాయని తెలిపింది. ఈ ప్యాకేజీ ద్వారా కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక, సామాజిక భద్రత మెరుగుపడుతుందని ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం.నాగరాజు తెలిపారు. అన్ని క్యాడర్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ఠ కవరేజీ, ఏకరూపత, విస్తృత సౌకర్యాలు కల్పించేందుకు గాను బ్యాంకులతో సంప్రదింపులు జరిపి చాలా జాగ్రత్తగా ప్యాకేజీలను రూపొందించినట్లు వెల్లడించారు. రూ.1.50 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.2 కోట్ల దాకా గగనతల ప్రమాద బీమా, మెరుగుపరిచిన సౌకర్యాలతో కూడిన జీరో బ్యాలెన్స్ వేతన ఖాతా, గృహ, విద్య, వాహన, వ్యక్తిగత రుణాలకు తక్కువ వడ్డీ, కార్డులకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, రివార్డ్ ప్రోగ్రామ్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, అపరిమిత లావాదేవీలు, నిర్వహణ చార్జీలు లేకపోవడం వంటి సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఆయా సదుపాయాలపై ప్రభుత్వరంగ బ్యాంకులు విస్తృతంగా ప్రచారం చేయాలని, ఉద్యోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉద్యోగుల అనుమతితో ప్రస్తుత ఖాతాల నుంచి కొత్త ప్యాకేజీకి మారేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.